పది పాసయ్యాం..

21 May, 2015 06:00 IST|Sakshi

జిల్లాకు 12వ స్థానం
 
90.2 ఉత్తీర్ణత శాతం
పెరిగిన ఉత్తీర్ణత.. పడిపోయిన స్థానం
బాలికలదే పైచేయి
203 మందికి పది జీపీఏ

 
 నెల్లూరు(విద్య) : రాష్ట్ర విభజన అనంతరం వెలువడిన మొట్టమొదటి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 90.29 ఉత్తీర్ణత శాతం సాధించినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఆశించినస్థానం రాకపోవడం నిరాశపరిచింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకు 12వ స్థానం రావడం ఒకింత నిరాశ కలిగించినా ఉత్తీర్ణత శాతం ఊరటనిచ్చింది. మార్చిలో జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మొత్తం 34,433 మంది హాజరుకాగా 31,078 మంది ఉత్తీర్ణత సాధించారు.

3,341 మంది ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 17,519 మందికి గాను 15,790 మంది ఉత్తీర్ణులై 90.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 16,900 మంది హాజరు కాగా 15,228 మంది ఉత్తీర్ణులై 90.46 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. 203 మంది 10/10 జీపీఏ సాధించారని డీఈఓ డి.ఆంజనేయులు తెలిపారు.  కేజీబీవీల్లో 336 మంది హాజరు కాగా 316 మంది ఉత్తీర్ణులై 94.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీల్లో నాయుడుపేటలో అత్యుత్తమ జీపీఏ 9.5 సాధించినట్లు ఎస్‌ఎస్‌ఏ పీఓ టి.కోదండరామిరెడ్డి తెలిపారు.

 కార్పొరేషన్‌లోనూ మెరుగైన ఫలితాలు
 కార్పొరేషన్ పరిధిలోని 15 స్కూళ్లలో 1076 మంది పరీక్షకు హాజరుకాగా 787 మంది ఉత్తీర్ణులై 73 శాతం నమోదు చేశారు. ఏసీనగర్‌లోని ఎంఎస్‌ఎం స్కూల్‌కు చెందిన విద్యార్థిని నవ్యభాను 10/10 జీపీఏ సాధించి కార్పొరేషన్ పాఠశాలలో 11వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేఎన్‌ఆర్ పాఠశాలకు చెందిన 9.7 జీపీఏతో సాయికిరణ్, వెంకటరమణ, వినయ్ ముగ్గురు విద్యార్థులు సాధించి 2వ స్థానం సాధించారు. కర్నాలమిట్ట కార్పొరేషన్, పీఎన్‌ఎం కార్పొరేషన్ స్కూల్స్ 91 శాతం అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించారు.

 జూన్ 18న అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ...
 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో తప్పినవారికి జూన్ 18 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆంజనేయులు తెలిపారు. జూన్ 2వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించారు. రీ వెరిఫికేషన్ చేయించుకోదలచిన అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్‌సైట్ నందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తిచేసిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. హాల్ టికెట్ జెరాక్స్ కాపీ, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, డూప్లీకేట్ మార్కుల లిస్ట్‌లను మే 31వ తేదీ సాయంత్రం 5గంటలలోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుల అటెస్టెషన్ చేయించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

విద్యార్థి వేర్వేరుగా చలానా కట్టాలని, గ్రూప్ చలానాలు స్వీకరించరన్నారు. ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1000లు చొప్పున చలానా కట్టాలన్నారు. మార్కుల రీకౌంటింగ్ చేయదలచుకున్న విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500లు చొప్పున చలానా కట్టి సదరు అప్లికేషన్‌ను నేరుగా సంచాలకులు, ప్రభుత్వ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అనే చిరునామాకు మే 31వ తేదీలోపల పంపాలని సూచించారు.

మరిన్ని వార్తలు