జీఐఎస్‌ సర్వే నిలుపుదల

3 Dec, 2018 13:58 IST|Sakshi

స్టేటస్‌ కో విధించిన ప్రభుత్వం

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ పనులు నిలిపేయాలని ఆదేశాలు

ఎన్నికల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం 

కడప కార్పొరేషన్‌/ప్రొద్దుటూరుటౌన్‌: జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పన్నును మదింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి యోగ్రఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ సర్వీసు(జీఐ ్డఎస్‌)ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్కులర్‌ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రజలకు పన్ను పెరిగినట్లు స్పెషల్‌ నోటీసులు జారీ చేయడం, రివిజన్‌ పిటిషన్లు తీసుకోవడం వంటివన్నీ తక్షణం నిలుపుదల చేయాలంటూ స్టేటస్‌ కో విధించింది. జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లలో ఇప్పటికే జీఐఎస్‌ సర్వే 90 శాతం పూర్తయింది. ఈ విధానం ద్వారా ప్రతి భవనాన్ని ఉపగ్రహానికి లింక్‌(జియో ట్యాగింగ్‌) చేసి కొలతలు వేసి ప న్ను వేసే విధానం ద్వారా జిల్లాలో 80 శాతానికిపైగా ఇళ్లకు పన్ను పెరిగింది.

ఆర్‌వీ అసోషియేట్స్‌ సంస్థ అనే సంస్థ అన్ని మున్సిపాలిటీల్లో ఈ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో కడప కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 2,29,900 గృహాలు ఉండగా, జీఐఎస్‌ సర్వే వల్ల 1.83లక్షల భవనాలకు పన్ను పె రిగినట్లు తెలుస్తోంది. ఇలా పన్ను పెరిగితే వచ్చే ఎన్నికల్లో  పెద్ద దెబ్బ తగులుతుందని భావించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం  నిర్ణయం వల్ల పట్టణ ప్రజలకు కాసింత ఉపశమనం కలగనుంది. ఈ సర్వే కోసం ఆర్వీ అసోషియేట్స్‌ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ సర్వేను పూర్తిగా నిలిపేస్తే ఆ సంస్థకు చెల్లించిన మొత్తం ప్రభుత్వం నష్టపోక తప్పదు. ఒకవేళ కొనసాగించాలనుకుంటే మాత్రం ఎప్పటి నుంచి కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సర్వే దాదాపు పూర్తయినందున మెడపై కత్తి వేలాడుతున్నట్లు   ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయనుందో, లేక పూర్తిగా రద్దు చేయనుందో తేలేవరకూ టెన్షన్‌ తప్పదు.

 రెవెన్యూ సిబ్బందిపై పెరిగిన పనిభారం
జీఐఎస్‌ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతి ఇంటికి సంబంధించిన కొలతలు తీసి  మున్సిపల్‌ కమిషనర్లకు నివేధిక రూపంలో ఇస్తోంది. వీటిని పరిశీలించిన కమిషనర్లు మళ్లీ ఆర్‌ఐలు, బిల్‌ కలెక్టర్లతో క్షేత్రస్థాయి విచారణ చేయిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీల్లో బిల్‌కలెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఓలపై పనిభారం పెరిగిపోయింది. ఓ వైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు కొత్తగా పన్నులు వేయడం, పేరు మార్పు, పన్నుల వసూళ్లు వంటి పనులన్నీ రెవెన్యూ విభాగం అధికారులే చేయాల్సి ఉంది. కొత్తగా జీఐఎస్‌ సర్వే వల్ల ప్రతి ఇంటినీ సర్వే చేయడం, ఆ ఇంటికి పన్ను పెరిగితే నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులపై యజమానులు సంతృప్తి చెందకపోతే రివిజన్‌ పిటిషన్లు స్వీకరించడం వంటి పనుల వల్ల పనిభారం తీవ్రంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ చేసినా పనులు పూర్తి కావడం లేదు. దీంతో సిబ్బందిపై ఆరోపణలు, ఫిర్యాదులు అధికమయ్యాయి.
 
జీఐఎస్‌ సర్వే డేటా నిలిపివేత
పురపాలక శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈఆర్‌పీ సిస్టమ్‌లో దాఖలు చేసిన జీఐఎస్‌ సర్వే డేటాను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిలిపివేయడమైనది. ఈ సర్వే ఆధారంగా ఇవ్వనున్న స్పెషల్‌ నోటీసుల బట్వాడాను కూడా నిలిపివేస్తున్నాం. స్పెషల్‌ నోటీసుల బట్వాడా జరిగి, రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేయడబడిన దరఖాస్తులపై తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాయిదా వేయాలని ఆదేశాలిచ్చాం.     – ఎస్‌. లవన్న,     కమీషనర్, కడప నగరపాలక సంస్థ.

  

మరిన్ని వార్తలు