అవినీతి పై సమగ్ర నివేదిక ఇవ్వండి : వైఎస్‌ జగన్‌

27 Jun, 2019 04:51 IST|Sakshi
సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాజధానిలో చోటుచేసుకున్న స్కాములపై లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట అంతులేని అవినీతి సాగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భూ సమీకరణ, భూముల కేటాయింపు, చేపట్టిన పనులు, వాటి కేటాయింపులు వంటి అంశాల్లో అవినీతి కనిపిస్తోందన్నారు. వీటన్నింటినీ లోతుగా పరిశీలించాలని, బాధ్యులెవరో గుర్తించాలని, ప్రభుత్వానికి ఎంత మేరకు నష్టం జరిగిందో సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రైతులు, ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఆర్‌డీఏ వ్యవహరించాలని, ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచిపేరు రావాలని స్పష్టం చేశారు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్న సంతృప్తి కలిగేలా చూడాలన్నారు.

ఎక్కడా అవినీతికి వత్తాసు పలకవద్దని, దీనిని ఏ దశలోనూ ప్రోత్సహించవద్దని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో అధికారులు తాము తీసుకెళ్లిన నివేదికలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చూపించి వాటిని వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఆ విషయాలను విని ప్రతి అంశంలోనూ చోటుచేసుకున్న అవినీతిపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని, వీటిలో అక్రమాలకు బాధ్యులెవరు, ఎంత నష్టం జరిగిందనే సమాచారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం, అదనపు కమిషనర్లు విజయకృష్ణన్, రామమనోహరరావు పాల్గొన్నారు. 

ఎన్ని వేల కోట్లు లూటీ అయ్యాయో : మంత్రి బొత్స 
రాజధాని నిర్మాణం ముసుగులో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ అయ్యిందో అంచనాకు అందడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమీక్ష ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అవినీతి కూపం ఎంత లోతు ఉందో తవ్వి తీయాల్సి ఉందన్నారు. ఏది ముట్టుకున్నా పెద్ద పెద్ద స్కాంలు బయటకొస్తున్నాయని చెప్పారు. భూములను సేకరించి వాటిని ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారని, తాబేదార్లు, చుట్టాలు, కావాల్సిన వాళ్లకు ఇచ్చేశారని తెలిపారు. రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. ఖర్చుకు మించి ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని.. ముందు అవినీతి కూపం నుంచి సీఆర్‌డీఏ బయటపడిన తరువాత నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. అక్రమ కట్టడాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మొత్తం 53 వేల ఎకరాల్లో రైతులవి, ప్రభుత్వానివి, వివాదాల్లో చిక్కుకున్నవి కూడా ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాల్లో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు