నీళ్ల చారే గతి..

4 Nov, 2015 23:22 IST|Sakshi
నీళ్ల చారే గతి..

పప్పన్నమే కాదు..పప్పు చారు కూడా లేదు
అంగన్‌వాడీలకు కందిపప్పు సరఫరా నిలిపేసిన సర్కార్
పాఠశాలలు, హాస్టళ్లకు ఇవ్వలేమంటున్న కాంట్రాక్టర్లు

 
 కందిపప్పు నిజంగానే బె‘ధర’గొడుతోంది. సామాన్యులు..మధ్యతరగతి ప్రజలనే కాదు..పప్పంటే లొట్టలేసే చిన్నారులకు కూడా దూరమైంది. చుక్కలనంటిన ధరల పుణ్యమాని ఒక వైపు సర్కార్, మరో వైపు కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో చిన్నారులు పప్పన్నం కాదుకదా..పప్పుచారన్నానికి దూరమవుతున్నారు. ధరల దెబ్బకు నీళ్ల చారే వీరికి దిక్కవుతోంది.
 
విశాఖపట్నం: బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర డబుల్ సెంచరీ దాటడంతో పప్పు కొనాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం అంగన్‌వాడీ, పాఠశాల చిన్నారులపై పడింది. అధిక మాంసకృత్తులు, పోషకాలు ఉన్న కంది పప్పు సరఫరాను కాంట్రాక్టు సంస్థలతో పాటు సర్కార్ కూడా నిలిపి  వేయడంతో జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్ల మెనూలో పప్పున్నం మాయమై పోయింది.     జిల్లాలో 4140 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలుండగా మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు 2,59,047 మంది ఉన్నారు. గతేడాదిగా కందిపప్పు ధరలు పెరుగుతున్నప్పటికీ మూడు నెలలుగా కనివినీ ఎరుగని రీతిలో ధర లు అమాంతంగా పెరగడంతో మధ్యా హ్న భోజన నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులతో కందిపప్పు కొనే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారు.

కూరగాయల ధరలు కూడా రోజుకో రీతిలో ఉండడంతో వా రంలో నాలుగు రోజులు ఆకుకూరలు, రసంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రెండ్రోజులు మాత్రమే తక్కువధరకు లభించే కూరగాయలతో కానిచ్చేస్తు న్నారు. ఎక్కడా పప్పు వాసన కూడా తగలనీయడంలేదు. ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాంసకృత్తులు, ప్రొటీన్లు అందక విద్యార్థులు బలహీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 65 వసతి గృహాల్లో 5,661మంది విద్యార్థులున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 64 హాస్టళ్లలో 6,600 మంది విద్యార్థులున్నారు. వసతిగృహాలకు కిలో రూ.110కే కందిపప్పు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.200లు దాటడం తో కంది పప్పు సరఫరా చేయడంలేదు. దీంతో హాస్టల్ మెనూలో కూడా పప్పన్నం మాయమైపోయింది. ఇక జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3587 మెయిన్, 1365 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో మూడునెలల  నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 65,317 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 87,353, బాలింతలు 28,106, గర్భిణులు27,285మంది ఉన్నారు.

వీరికి ఆయా కేంద్రాల్లో అమృత హస్తం, బాలామృతం కింద పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి. ఇందుకోసం బియ్యం, కందిప్పు ప్రతీ నెలా ప్రభుత్వమే సరఫరా చేస్తుంటుంది. మూడు నెలల క్రితం నుంచి వీటికి కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో అంగన్‌వాడీల్లో చిన్నారులకే కాదు...గర్భిణులు.. బాలింతలకు సైతం పోషకవిలువలను ఇచ్చే పప్నన్నం పెట్టడం మానేశారు. దీంతో విద్యార్థులు, చిన్నారులకు పౌష్టికాహారం లోపానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలను అదుపుచేయడంతోపాటు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు