ప్రభుత్వం ఇచ్చిన రూ. 1,241 కోట్ల రుణాలు రద్దు

26 May, 2014 03:13 IST|Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన చిన్న రుణాలకు స్వస్తి

 హైదరాబాద్: చాలా ఏళ్ల క్రితం పలు ప్రభుత్వ, విదేశీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాల్లో రికవరీకాని, తిరిగి చెల్లించే అవకాశం లేని చిన్న రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రుణాల పంపిణీ సమస్యగా మారనుండడం, ఖాతాలను పూర్తిగా క్లియర్ చేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాలు తీసుకున్నవాటిలో కొన్ని సంస్థలు ఇప్పుడు అస్తిత్వంలోనే లేకుండాపోగా.. కొన్ని సంస్థలు రుణాలను తీర్చే స్థితిలో లేవు. మరికొన్ని సంస్థలకు ఉమ్మడి రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో సేవల కోసం ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు తీర్చడానికి ఆ సంస్థలు ఇప్పుడు లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వాటి మంజూరు వివరాలు ఉన్నాయి. దీంతో పది లక్షల రూపాయల లోపు, పది లక్షల రూపాయలకుపైబడి మంజూరు చేసిన పలు రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో చిత్రమేమిటంటే పాకిస్థాన్‌లోని నాలుగు సంస్థలకు, శ్రీలంక రాజధాని కొలంబో, బర్మాలోని ఒక్కో సంస్థకు కూడా కొన్నేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రూపంలో రుణాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయించింది.

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓరియంట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్‌కు రూ. 2.88 లక్షలు, మార్దన్‌కు చెందిన ఫ్రాంటియర్ సుగర్ మిల్స్ అండ్ డిస్టలరీస్ లిమిటెడ్‌కు రూ. 1.15 లక్షలు, పశ్చిమ పాకిస్థాన్ నిర్వాసితులకు రూ. 50.27 లక్షలు, తూర్పు పాకిస్థాన్ నిర్వాసితులకు రూ. 37.19 లక్షలు, బర్మా కాందిశీకులకు రూ. 1.22 కోట్లు, శ్రీలంకలోని కొలంబోకు చెందిన మారెసేవ కలుతార రబ్బర్ కంపెనీకి రూ. 0.21 లక్షలు రుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 113 సంస్థలకు చెందిన పది లక్షల రూపాయలలోపు రుణాలు, 66 సంస్థలకు చెందిన పది లక్షల రూపాయలకుపైబడిన రుణాలు రద్దు చేసినవాటిలో ఉన్నాయి. మరో 25 సంస్థలకు మంజూరు చేసిన రుణాలను గ్రాంట్‌ల కిందకి మార్చుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, ఏపీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, ఏపీఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్‌లకు మంజూరు చేసిన రుణాలను ఆస్తుల కల్పన వ్యయం కిందికి మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద రూ. 1,241 కోట్ల రుణాలను రద్దు చేశారు. దీనికి అకౌంటెంట్ జనరల్ ఆమోదం కూడా తెలిపారు.
 

మరిన్ని వార్తలు