సిఫార్సు బదిలీలు!

14 Aug, 2015 04:25 IST|Sakshi
సిఫార్సు బదిలీలు!

- ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వాలిపోతున్న ఎంపీడీఓలు
- నేడు ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరిగేనా..?
అనంతపురం సెంట్రల్ :
జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల విషయంలో సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో బదిలీలు జరిగిన ప్రతి సారీ ఈ విషయం బహిర్గతమైంది. తొలిరోజు అందరి సమక్షంలో బదిలీలు పారదర్శకంగా జరిగినా తెల్లారేసరికి అవి తారుమారు అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో మొత్తం ఇలాగే మారిపోయాయి. తొలుత కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుపుతున్నామని ప్రకటించినా చివరకు మాత్రం అంతా తారుమారవుతున్నాయి.

ఉద్యోగుల బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చెర్మైన్ చమన్ నిర్ణయాలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చుతున్నారు. తమ నియోజకవర్గంలోకి వచ్చే అధికారి తన ప్రమేయంతోనే రావాలని భావిస్తున్నారు. గతసారి బదిలీల్లో చెన్నేకొత్తపల్లి, కూడేరు, శింగనమల తదితర మండలాల ఎంపీడీఓలు ఆయా మండలాల్లో బాధ్యతలు చేపట్టకుండానే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  రెండు రోజుల నుంచే సిఫార్సు లేఖలతో జెడ్పీకి వాలిపోతున్నారు.
 
పరిపాలన సౌలభ్యం ముసుగులో : పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాలపరిమితితో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం రాజకీయ అండదండలు ఉన్న ఉద్యోగులకు వరంగా మారుతోంది. పరిపాలన సౌలభ్యం ముసుగులో అనుకున్న స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాతాలకు వెళ్లినా డెప్యుటేషన్ ముసుగులో తిరిగి యధాస్థానానికి రావచ్చులే అన్న ధీమా మరికొంతమందిలో కనిపిస్తోంది. దీని వలన   కొన్నేళ్ల నుంచి మారుమూల ప్రాంతాల్లోనే తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యోగాలు చేస్తున్న వారికి తీవ్ర నష్టం కలుగుతోంది.  
 
తొలుత సాధారణ బదిలీలు పూర్తై తర్వాత నూతనంగా పదోన్నతులు పొందిన ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు కల్పించాలని నిర్ణయించారు. అయితే అందులో ఉన్న కొంతమంది ముందే చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. చెర్మైన్ దగ్గర ఉన్న సంబంధాలతో మంచి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులతో కళకళలాడింది. దీంతో శుక్రవారం జరగనున్న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయా.? కౌన్సెలింగ్‌లో దక్కించుకున్న ఉద్యోగులను ఆయా స్థానాల్లో కొనసాగిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు