మంగంపేట బెరైటీస్‌పై 8న గ్లోబల్ టెండర్లు

6 May, 2015 23:06 IST|Sakshi
మంగంపేట వద్ద బెరైటీస్‌ను పరిశీలిస్తున్న కాగిత వెంకట్రావు, కమిటీ సభ్యులు

ఓబులవారిపల్లె: వైఎస్‌ఆర్ జిల్లాలోని మంగంపేట బెరైటీస్‌కు ఈ నెల 8న గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తున్నామని, ఆ తర్వాతే ఖనిజ విక్రయం మొదలవుతుందని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగిత వెంకట్రావు తెలిపారు. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌రావు, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఏపీఎండీసీ ఆధ్వర్యంలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయ వనరులు పెంచుకునే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని, అందులో భాగంగానే అసెంబ్లీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గనుల పరిశీలనకు పంపిందన్నారు.

ఈ మేరకు తమ బృందం ఖనిజం వెలికితీత, మార్కెటింగ్ అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. సంస్థలో పని చేసే ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్య తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. గనుల నిలకడపై కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. నెలాఖరులోగా ప్రభుత్వం కొత్త మైనింగ్ విధానాన్ని తీసుకురానుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు