గ్లైపోచేటు

13 Aug, 2018 10:23 IST|Sakshi
గ్లైపోచేటు

కర్నూలు(అగ్రికల్చర్‌) : గ్లైపోసేట్‌.. కలుపు నివారణ మందు. దీనిని మోన్‌శాంటో బహుళజాతి విత్తన సంస్థ తయారు చేస్తోంది. జీవ వైవిధ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో దీని అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే గుట్టు చప్పుడుకాకుండా జిల్లాలో విక్రయాలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడా గ్లైపోసేట్‌ కలుపు మందు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి.

బీటీ పత్తి సాగు చేసే రైతులు కలుపు నివారణ కోసం దీనిని వాడుతున్నారు. గత ఏడాది జిల్లాలో పురుగు మందులు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై 20 మందికిపైగా రైతులు మృత్యువాత పడ్డారు. వీరిలో కొందరు గ్లైపోసేట్‌ వాడకం వల్లే  విషప్రభావానికి గురై మృతిచెందారనే విమర్శలూ వచ్చాయి. తాజాగా.. ఈ మందు వాడకం కేన్సర్‌కు కారణమవుతోందని అమెరికాలోని కోర్టు ఏకంగా మోన్‌శ్యాంటో కంపెనీకి రూ.2 వేల కోట్లు జరిమానా విధించడం చర్చనీయాంశం అయింది. 

అనుమతులు లేకున్నా సాగు.. 
హెచ్‌టీ(హైబ్రిడిక్‌ టాలరెంట్‌) పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ జిల్లాలో గత ఏడాది సాగు భారీగా పెరిగింది. దీనిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది హెచ్‌టీ పత్తి సాగు నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఫలితం లేకుండాపోయింది.  జిలాల్లో 1.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగవగా..ఇందులో 50 వేల ఎకరాల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కార్పొరేట్‌ విత్తన సంస్థలే బీజీ–2 పేరుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను రైతుల్లోకి తీసుకెళ్లాయి. విత్తన దుకాణాల ద్వారా కాకుండా నేరుగా రైతులకు విక్రయించారు. తాము హెచ్‌టీ పత్తి సాగు చేసిన విషయం రైతులకు కూడా తెలియకపోవడం విశేషం. హెచ్‌టీ పత్తిలో కలుపు మందు నివారణకు ఉపయోగించే గ్లైపోసేట్‌ మందులో అనర్థాలు ఉన్నాయని జూన్‌ నుంచి డిసెంబరు నెల వరకు అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది.   

యథావిధిగా అమ్మకాలు.... గ్లైపోసేట్‌ కెమికల్స్‌ వివిధ పేర్లతో లభ్యమవుతోంది. రౌండప్, గ్‌లెసైల్, వీడ్‌కిల్లర్‌ పేర్లతో అమ్ముతున్నారు. పెస్టిసైడ్‌ దుకాణాల ద్వారా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో పొలాల్లో ఎటువంటి పంటలు లేని సమయంలో మొండిజాతి కలుపును నివారించుకునేందుకు గ్లైపోసేట్‌ వాడకానికి అనుమతి ఉంది. ఇందుకు వ్యవసాయాధికారి/ వ్యవసాయ శాస్త్రవేత్త  అనుమతి అవసరం. అయితే ఎవరూ సిఫారస్సు లేకుండానే ప్రమాదకమైన మందులను విచ్చిల విడిగా అమ్ముతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయాధికారుల తనిఖీలు లేకపోవడంతో పురుగు మందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  

ఇవీ నష్టాలు..  గ్లైపోసేట్‌ వాడటం వల్ల నేల నిస్సారంగా  మారుతుంది. మందు అవశేషాలు పంట ఉత్పత్తులు, గడ్డిలో పేరుకొని ఉండి..మానవాళి ఆరోగ్యాలకు హాని కలిగిస్తాయి. అవశేషాలు గాలి, నీరులో కలిసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.   జిల్లాలో 2014 
నుంచి గ్లైపోసేట్‌  అమ్మకాలు పెరిగినా పట్టించుకునే వారు లేరు. 

లైసెన్సులు రద్దు చేస్తాం:  
జిల్లాలో గ్లైపోసేట్‌  అమ్మకాలను నిషేధించాం. పెస్టిసైడ్‌ డీలర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. వ్యవసాయాధికారి సిఫారస్సు లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. ఇప్పటికే వ్యవసాయాధికారులు షాపులు తనిఖీ చేసి   తాత్కాలికంగా స్టాప్‌సేల్‌ ఇచ్చారు. పత్తి పంట ఉన్న సమయంలో  అమ్మకాలు చేపడితే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాం.   
మల్లికార్జునరావు, డీడీఏ(పీపీ), వ్యవసాయ శాఖ, కర్నూలు 

మరిన్ని వార్తలు