కాముని చెరువుపై జీఎంఆర్ కన్ను!

15 Aug, 2013 05:14 IST|Sakshi
శంషాబాద్ పరిధిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నిజాం కాలంలో కాముని చెరువు 166 ఎకరాల్లో తవ్వించారు. అంచనాలకు అనుగుణంగానే ఏళ్లపాటు ఈ చెరువు తాగునీరు, సాగునీరందించి మత్స్యకారులకు, దోభీఘాట్ అవసరాలకు ఉపయోగపడింది. ఈ చెరువు మూలంగా భూగర్భజలాలు వృద్ధి చెందాయి. అయితే నిర్వహణ సరిగాలేక ఈ మధ్యకాలంలో పలుచోట్ల నుంచి పిల్లకాలువల ద్వారా వ్యర్థాలు అధిక మొత్తంలో వచ్చి చెరువును కలుషితం చేస్తున్నాయి. 
 
గ్రీన్‌బెల్ట్ పేరిట..
విమానాశ్రయంలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కాముని చెరువు నీటిని వినియోగించుకుంటామని 2012, మే 23న నీటిపారుదల ముఖ్య కార్యదర్శికి జీఎంఆర్ సంస్థ వినతి పత్రాన్ని అందజేసింది. చెరువు కింద ఎలాంటి ఆయకట్టు లేదని, ఆ నీటిని ఎందుకూ వినియోగించడంలేదని అందులో పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. శంషాబాద్ పట్టణంలో సుమారు నలభై వేల జనాభా, మూడు వేలకుపైగా ఇళ్లు, భవనాలు ఉన్నాయి. ఇప్పటివరకు పట్టణానికి ఎలాంటి తాగునీటి ఆధారం లేదు. కేవలం పంచాయతీ పరిధిలోనే నీటి సరఫరాకు 62 బోర్లను వినియోగిస్తున్నారు. ఇక ఇళ్లలో సుమారు 1500పైగా సొంత బోర్లు ఉన్నట్లు అధికారిక సమాచారం. పట్టణానికి చెరువు ఎగువ భాగంలో ఉండడంతో కింద ఉన్న మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శకాలనీ, రాళ్లగూడ తదితర బస్తీలో కాముని చెరువులో నీళ్లు ఉన్నప్పుడే బోర్లలో నీళ్లు చేరుతాయి. స్థానికంగా భూగర్భజలాలు ఉండడానికి ఈ చెరువే ప్రధాన కారణం. 
 
హిమాయత్‌సాగర్‌కూ దెబ్బే..
ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంతోపాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా హిమాయత్‌సాగర్ వైపు వెళ్లేది. దీంతో నిజాం కాలం నాడే స్థానిక ప్రజల ఉపయోగార్థం ఈ చెరువు నిర్మాణం చేశారు. ఈ చెరువు నిండితే నీరు జోష్ కుంటవైపు వెళ్లి అక్కడి నుంచి సిద్దులగుట్ట, కొత్వాల్‌గూడ గ్రామాల మీదుగా హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటుంది. విమానాశ్రయ అవసరాలకు ఈ చెరువు నీటిని వాడడం ప్రారంభిస్తే అతి కొద్ది కాలంలోనే ఈ చెరువు ఎండిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఎండిపోతే శంషాబాద్‌తోపాటు రాళ్లగూడ, కొత్వాల్‌గూడ గ్రామాలే కాకుండా హిమాయత్‌సాగర్‌కు కూడా నీటి వనరు లేకుండా పోతుంది.
 
ఒప్పుకోమంటున్న స్థానికులు
చెరువు నీటిని జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సాగునీటి సంఘంతోపాటు స్థానికంగా ఉన్న కిసాన్ రైతు సంఘం, మత్య్సకారులు, దోభీఘాట్ కార్మికులు ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. చెరువును పరిర క్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు