చంద్రబాబువి నిరాధార ఆరోపణలు

6 Jan, 2020 03:40 IST|Sakshi

నిపుణుల కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు 

సీఎం ముఖ్య సలహాదారు చెప్పినట్టుగా నివేదిక ఇచ్చారనడంలో వాస్తవం లేదు 

అన్ని జిల్లాల ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు స్వీకరించాం 

ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశాం

సాక్షి, అమరావతి: రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై తన నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను కమిటీ కన్వీనర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు ఖండించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పినట్టుగా నివేదిక ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ఆరోపణలన్నీ నిరాధారం, భ్రాంతితో కూడినవని ఆదివారం ఒక ప్రకటనలో జీఎన్‌ రావు పేర్కొన్నారు. నిపుణుల కమిటీలో అన్ని రంగాలకు చెందిన అపార అనుభవమున్న నిపుణులు, నిష్ణాతులు ఉన్నారని తెలిపారు. కమిటీలోని సభ్యులకు పట్టణ ప్రణాళిక, డిజైనింగ్, నగరాభివృద్ధి, ప్రపంచ నగరాల అభివృద్ధి అంశాల్లో విశేష అనుభవం, నైపుణ్యం ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రజల సలహాలను పరిగణనలోకి తీసుకుని సూచనలు చేశాం..
కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమని జీఎన్‌ రావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పూర్తికి అనుసరిస్తున్న వ్యూహాలపై మాత్రమే ప్రభుత్వంలోని వ్యక్తులతో మాట్లాడాం తప్ప నివేదికలోని అంశాలపై ఎవ్వరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. రాజధానితోపాటు 13 జిల్లాల్లో మానవాభివృద్ధి సూచికల పరిస్థితులు, అభివృద్ధి, వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఆకాంక్షలు, సూచనలకు అనుగుణంగా రాజధానితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని ఆయన వివరించారు.

ఎవరి ప్రమేయం లేదు..
నివేదిక తయారుచేసే సమయంలో కమిటీ సభ్యులకు కానీ, తనకు కానీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు లేదా ప్రభుత్వంలోని వ్యక్తులు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, వారి నుంచి ఎటువంటి సూచనలు తీసుకోలేదని జీఎన్‌ రావు స్పష్టం చేశారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారం, అవాస్తవం, ఊహాజనితమని స్పష్టం చేశారు. కన్వీనర్‌గా కమిటీలోని సభ్యులకు తాను సహాయ సహకారాలు అందించానని ఆయన పేర్కొన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ కలసి సమష్టిగా రహస్యంగా నివేదిక రూపొందించారని తెలిపారు. 

మరిన్ని వార్తలు