ఏపీ ప్రభుత్వానికి జీఎన్‌ రావు కమిటీ సిఫార్సులు

20 Dec, 2019 17:58 IST|Sakshi

 ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నివేదిక: జీఎన్‌ రావు కమిటీ

సాక్షి, అమరావతి: ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తుది నివేదిక సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాజధాని, అభివృద్ధి అనే అంశాలపై కమిటీ సభ్యులం అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం.  రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి. మరి  కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వీటి మధ్య సమతూకం సాధించాలి. దీని కోసం రెండు అంచెల వ్యూహాన్ని సూచించాం. 

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అలాగే నదులు, అడవులు ఉన్నాయి,. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు ఇచ్చాం. వరద ముంపులేని రాజధాని ఉండాలని సూచనలు చేశాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం. రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్రమైన పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచనలు చేశాం. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్లు విభజించి అభివృద్ధి చేయాలని సూచించాం ’ అని తెలిపారు.

చదవండిసీఎం జగన్‌తో జీఎన్‌ రావు కమిటీ భేటీ 

కమిటీ సిఫార్సులు ఇవే

రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా  చూడాలి

  • ఉత్తరాంధ్ర  : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
  • మధ్య కోస్తా : ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా
  • దక్షిణ కోస్తా : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 
  • రాయలసీమ : చిత్తూరు, కడప,  కర్నూలు, అనంతపురం జిల్లాలు
  • కర్ణాటక తరహాలో రీజినల్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలి
  • పాలనా వ్యవహారాలు విశాఖలో పెట్టాలి
     
  • తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు
  • అమరావతిలో రాజభవన్‌, అసెంబ్లీ సమావేశాలు,  హైకోర్టు బెంచ్‌
  • విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం, హైకోర్టు బెంచ్‌
  • వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి
  • శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు
  • తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలి
  • మంగళగిరిలో మంత్రులు, అధికారుల క్వార్టర్లు
మరిన్ని వార్తలు