పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు

16 Aug, 2014 02:52 IST|Sakshi

* కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం చంద్రబాబు
* త్వరలో డీఎస్సీ.. ఇకపై ఏటా నోటిఫికేషన్

 
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకులను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం.
 
 విశాఖ, తిరుపతి, విజయవాడలను మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం. 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మార్చి చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతాం. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును నాలుగైదేళ్లలో పూర్తి చేస్తాం. రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం.
 
 కర్నూలుపై వరాల జల్లు...
 కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో తొలి నగరంగా కర్నూలును అభివృద్ధి చేస్తాం. నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు. మాన్యుఫాక్చరింగ్, హార్డ్‌వేర్, ఐటీ పరిశ్రమల ఏర్పాటు. అక్కడే విమానాశ్రయం నిర్మాణం. తుంగభద్ర నదిపై సి.బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద 22 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం. నంద్యాలలోని వ్యవసాయ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా మారుస్తాం. నిమ్స్ తరహాలో ‘రాయలసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ను అభివృద్ధి చేస్తాం.
 
 ఎవరూ ఊహించనిది జరిగింది:బాబు
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం చేపడుతుందని ఏవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి దానికీ ఓ టైం ఉంటుందని, ఎన్నికల్లో అలా తనకు టైం కలిసొచ్చిందని అన్నారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అప్పటివరకు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పారు. స్వాతంత్య్ర దిన వేడుకల అనంతరం కర్నూలులో కొందరు విలేకరులకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకంటే ఆంధ్రప్రదేశ్‌పై తనకే ఎక్కువ అవగాహన ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని, భూముల సేకరణ పెద్ద సమస్యకాదని చెప్పారు.

మరిన్ని వార్తలు