ముంపులో భద్రాద్రి రామయ్య

4 Aug, 2013 02:16 IST|Sakshi
ముంపులో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, న్యూస్‌లైన్: రాముని పాదాలను తాకేందుకా అన్నట్టూ భద్రాద్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరం ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది.  భద్రాచలం వద్ద శనివారం 61.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. కరకట్ట స్లూయిస్ నుంచి నీరు లీకవడంతో పాటు, సుభాష్‌నగర్ కాలనీ వైపు నుంచి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించింది. దీంతో విస్తాకాంప్లెక్స్ పూర్తిగా మునిగిపోయింది. ఉత్తర ద్వారం దాటి కల్యాణ మండపం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. స్నానఘట్టాల వద్ద ఉన్న ఆలయాలు, కల్యాణ కట్ట పూర్తిగా మునిగిపోయాయి. రాముడి కల్యాణం జరిగే మిథిలా స్టేడియం చుట్టూ వరద నీరు చేరడంతోపాటు, అంబాసత్రం వరకూ రహదారిపై నీరు పోటెత్తింది.
 
 సుభాష్‌నగర్ కాలనీలో 200 ఇళ్లు నీటమునిగాయి. 2006లో 66.9 అడుగుల నీటిమట్టం నమోదైనప్పటికీ ఈ స్థాయిలో భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించలేదని పట్టణ వాసులు చెబుతున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 14 మండలాల్లో 200 గ్రామాలు పూర్తిగా నీటిముంపునకు గురయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సుమారు 573 గ్రామాల ప్రజలు చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ముంపు బాధితుల కోసం 94 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 16 వేల మందిని తరలించారు. అయితే, వాజేడు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ముంపు బాధితుల కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయలేదు. సుమారు రెండు వేల మంది సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో తలదాచుకుంటున్నారు. జిల్లాలో 31 వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగినట్లుగా అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సిర్పూర్(టి), బెజ్జూరు మండలాల్లో 20 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. పెన్‌గంగ ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడం.. తాటిచెట్టు ఒర్రెవంతెనపై ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సిర్పూర్(టి)లో నాటుపడవలను నిషేధించారు.
 
 ముంపులోనే లంక గ్రామాలు
 ఎగువ ప్రాంతాల నుంచి భారీస్థాయిలో వస్తున వరదనీటితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నది నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. శనివారం మధ్యాహ్నం అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి వరద మరింత పెరిగి నీటిమట్టం 18.20 అడుగులకు చేరింది. ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో నీటిమట్టం నమోదైంది. 19,78,551 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో మూడోసారి వరద పోటెత్తుతుండడంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీకి ఎగువన ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాలతో పాటు, దిగువన ఉన్న అయినవిల్లి, మామిడికుదురు, ముమ్మిడివరం, పి.గన్నవరం మండలాల్లోని పలు లంకగ్రామాలు ముంపునుంచి బయటపడడం లేదు. దేవీపట్నంలో 30, కోనసీమలో 46 గ్రామాలు ఇప్పటికే వరద బారిన పడ్డాయి.
 
 లోతట్టు ప్రాంతాల వాసులను తరలించేందుకు 200 పడవలను సిద్ధంగా ఉంచారు. ఉద్ధృతి పెరిగే సూచనలుండడంతో ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం మండలంలో ఎగువన ఉన్న 26 గిరిజన గ్రామాలు లో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయూరుు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం పోలవరంలోని నూతనగూడెం, కమ్మరగూడెం, పాత పోలవరంలోని రోడ్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది.

మరిన్ని వార్తలు