అయ్యో పాపం; ‘హాసిని ఎప్పుడొస్తుంది’

16 Sep, 2019 14:36 IST|Sakshi

సాక్షి,  తిరుపతి : కచ్చలూరు పడవ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యంకాగా.. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో భర్త, కుమార్తెను కోల్పోయి... తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డ మధులత ఆస్పత్రిలో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం భార్యాబిడ్డతో కలిసి ఆనందంగా జీవించేవారు. పెట్రోలు బంకు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం.. తన తండ్రి అస్తికలను గోదావరిలో కలపడానికి కుటుంబంతో వెళ్లి ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన ముద్దుల కూతురు చిన్నారి హాసిని కూడా పడవ ప్రమాదంలో మృతి చెందగా...భార్య మధులత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం స్కూల్‌ తరఫున ఫీల్డ్ ట్రిప్‌కు వెళ్లాల్సిన హాసిని ఇలా అర్ధాంతరంగా తమను వీడి పోయిందంటూ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడసారి చూపు కోసం తమ స్నేహితురాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

కాగా ‘పడవ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’అంటూ మధులత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబం గతంలో ముచ్చటగా గడిపిన తాలూకు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూసిన నెటిజన్లు.. ‘అయ్యోం పాపం. మరణంలోనూ వీడని బంధం’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు