జన కెరటం

15 Jul, 2015 03:54 IST|Sakshi

 పశ్చిమాన మొదలైన పుష్కర పండగ
 తొలి రోజే భారీగా పోటెత్తిన యాత్రికులు
 6 లక్షలు దాటిన భక్తుల తాకిడి
 కొవ్వూరుకు కంచి పీఠాధిపతులు రాక
 నరసాపురంలో పుష్కరాల్ని
 ప్రారంభించిన కుర్తాళం పీఠాధిపతి
 సర్కారు అరకొర ఏర్పాట్లతో నరకయాతన
 ప్రచారం విస్తృతం.. ఏర్పాట్లు అస్తవ్యస్తం

 
 దివ్య గోదావరి భవ్య సంబరం ఆరంభమైంది. పడమర గోదావరి గట్టు వెంబడి జన కెరటం ఉరకలెత్తింది. జిల్లాలోని రేవులన్నీ జన గోదారులయ్యాయి. పావన వాహిని మహాపర్వానికి దివిటీలు పట్టాయి. ఆ తల్లి ఒడిలో మూడు మునకలేసి.. తీర్థ విధులు నిర్వర్తించి భక్తులంతా పరవశించారు. భానుడి భుగభగలను సైతం తోసిరాజని తల్లి గోదారమ్మను అర్చించేందుకు బారులు తీరారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :అధిక ఆషాఢ బహుళ త్రయోదశి.. బృహస్పతి (గురుడు) సింహరాశిలో ప్రవేశించిన శుభవేళ భక్త కోటికి పుణ్యసిరులను ప్రసాదిస్తూ గోదారమ్మ తల్లి పుష్కర వేడుక ప్రభంజనంలా మొదలైంది. కొవ్వూరులో మంగళవారం ఉదయం 6.26 గంటల తర్వాత కంచికామకోటి పీఠం ఉపపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి నదీ పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. గోష్పాద క్షేత్రంలో విజయేంద్ర సరస్వతి తొలిస్నానం ఆచరించగా, నరసాపురం వలంధర రేవులో పుష్కర స్నానాలను కుర్తాళం పీఠాధిపతి  సిద్ధేశ్వరానందభారతి స్వామీజీ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. 12 ఏళ్లకు వచ్చే పుష్కరాలు..
 
  అందునా ఇవి 144 ఏళ్లకు వచ్చే మహా పుష్కరాలుగా ప్రచారం జరగడంతో గోదావరి తీరాలు భక్తజన సంద్రంతో నిండిపోయాయి. జిల్లాలోని 97 ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 11గంటల వరకు భక్తులు అంచనాలను మించి పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 3లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేయగా, సాయంత్రం 6 గంటల వరకు 5,93,227 మంది స్నానాలు ఆచరించారు. రాత్రి 10 గంటలకు మరో 60 వేల మంది స్నానాలు ఆచరించినట్టు అంచనా. అధికారిక గణాం కాల ప్రకారం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో 1.50 లక్షల మంది, నరసాపురంలో 1.77లక్షల మంది, సిద్ధాంతంలో 50వేల మంది, పట్టిసీమలో 25వేల మంది, జిల్లాలోని ఇతర మండలాల్లో 1.85 లక్షల మంది స్నానాలు ఆచరించారు.
 
 రాజమండ్రి విషాద ఘటనతో.. కొవ్వూరుకు వెల్లువలా
 రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో యాత్రికులు మృత్యువాత పడిన ఘటనతో ఇతర ప్రాంతాల భక్తులు ఒక్కసారిగా కొవ్వూరుకు తరలివచ్చారు. రాజమండ్రి వరకు టికెట్ తీసుకున్న రైలు ప్రయాణికులు కొవ్వూరులో దిగి పోయారు. రైల్వే అధికారులు రాజమండ్రి వెళ్లే అన్ని రైళ్లను హాల్ట్ ఉన్నా లేకపోయినా కొవ్వూరులో నిలుపుదల చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో  వివిధ ప్రాంతాల నుం చి విజయవాడ, ఏలూరు మీదుగా రాజమండ్రికి బయలుదేరిన వేలాదిమంది కొవ్వూరులోనే దిగిపోయారు. బస్సులు, వాహనాలన్నీ నిలిచిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభిం చింది. ఉదయం 10గంటలకే ఏలూరు-కొవ్వూరు స్టేట్ హై వేపై పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భక్తులు పుష్కరఘాట్ల వద్దకు చేరుకోలేక అష్టకష్టాలు పడ్డారు. పుష్కరనగర్ నుంచి ఘాట్ల వరకు ఉచిత బస్సులు తగినన్ని లేకపోవడం, ఘాట్ల వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, ఉదయం నుంచే ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో యాత్రికులు నరకయాతన అనుభవించారు.
 
 నరసాపురంలో వేకువజామునుంచే..
 నరసాపురానికి మంగళవారం వేకువజాము 3గంటల నుంచే భక్తుల రాక మొదలైంది. జిల్లా నలుమూలల నుంచి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో చేరుకున్నారు. అధికారుల అంచనాలకు రెట్టింపు సంఖ్యలో జనం రావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. పాలకొల్లు రోడ్డులో వాహనాలను నిలిపివేయడంతో అక్కడ నుంచి ఘాట్‌లకు నడిచివచ్చారు. ఒక్క వలంధర రేవులోనే తొలిరోజు సుమారు లక్షమంది పైగా స్నానాలు చేశారని అంచనా. జిల్లాలో మూడవ ప్రాధాన్య ప్రాంతమైన సిద్ధాం తంలో 50వేల మంది స్నానాలు ఆచరించినట్టు అంచనా.
 
 సిద్ధాంతంలో భక్తులకు గాయాలు
 సిద్ధాంతం కేదారీఘాట్‌లో పదిమంది భక్తులకు గాయాల య్యాయి. రేవులో దిగిన మహిళలు అడుగున రాళ్లు ఉండటంతో పడిపోయారు. పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన శకుంతల కాలికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆచంట, పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, యలమంచిలి మండలం దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం, పట్టిసీమ, పోలవరం గూటాల ఘాట్‌లలో భక్తులు స్నానాలు చేశారు.
 
 కొవ్వూరులో యాత్రికుల ధర్నా
 పుష్కరనగర్ నుంచి స్నానఘట్టాలకు వచ్చేందుకు బస్సులు లేక కొవ్వూరులో భక్తులు ధర్నా చేపట్టారు. పుష్కరాలకు విస్తృతంగా ప్రచారం చేపట్టిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారంటూ యాత్రికులు నిరసన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు