జూన్ 11 వరకే ముహూర్తాలు!

17 Mar, 2015 23:42 IST|Sakshi
జూన్ 11 వరకే ముహూర్తాలు!

సామర్లకోట : గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పుష్కరాలకు సంబంధించిన విధినిషేధాలను తప్పనిసరిగా పాటించాలని తూర్పు గోదావరి జిలా సామర్లకోటకు చెందిన ప్రముఖ సిద్ధాంతి అళక్కి కాశీ విశ్వనాథశాస్త్రి అన్నారు. పుష్కరాలకు ముందు, తర్వాత వివాహాలు చేసుకోవడంపై పలు అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు.  12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర పుష్కరాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో పాటిస్తారన్నారు. గోదావరి జలాలు ప్రవహించే ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా పుష్కర నియమ నిబంధనలు పాటించాలన్నారు.


ముహూర్త బలాలను బట్టి జూన్ 11 వరకు వివాహాలు చేసుకోవడానికి ఏ ఆటంకమూ లేదని స్పష్టం చేశారు. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. అయితే పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14 నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు ముహూర్తాలు లేవన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నివసించేవారు మినహా మిగిలినవారు వివాహాలు చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని చెప్పారు. మన్మథ నామ సంవత్సరం సందర్భంగా శివపార్వతులను పూజిస్తే సత్ఫలితాలు లభిస్తాయని సూచించారు.

మరిన్ని వార్తలు