అవసరం రూ.80 లక్షలు..మంజూరు రూ.8 లక్షలు

20 Feb, 2015 00:51 IST|Sakshi

     రంగులకూ, టైల్స్‌కే ఆ మొత్తం సరి
     అదనపు సౌకర్యాలకు సొమ్ములు కరువు
     మురమళ్ల వీరేశ్వరుని సన్నిధిపై చిన్నచూపు
     పుష్కరాలకు 6 లక్షల మంది వస్తారని అంచనా
     అయినా పట్టించుకోని ప్రభుత్వం

 ఐ.పోలవరం :గోదావరి తీరంలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు ప్రభుత్వం కోట్లు కేటాయించినా.. నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి నామమాత్రంగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జూలై 14 నుంచి  పుష్కర పర్వదినాలు ప్రారంభమవుతుండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానంలో కనీస సౌకర్యాలు కల్పించవలసి ఉంది. కాశీ తరువాత నిత్యం పరమశివునికి కల్యాణం జరిగే ఏకైక పుణ్యక్షేత్రం మురమళ్ల. ఆలయంలో ప్రత్యేకంగా వివాహం కాని యువతీయువకులు తమ జన్మనక్షత్రాల ప్రకారం సాధన తార చూసుకొని, ఇక్కడ కల్యాణం జరిపించుకొంటే తక్షణమే వివాహం అవుతుందని ప్రగాఢ నమ్మకం. వీరేశ్వరుని సన్నిధిలో ప్రతినిత్యం 72 మంది భక్తులు గోత్రనామాలతో కల్యాణం జరగడం విశేషం.
 
 ఏటా 10 లక్షల మంది రాక..
 మురమళ్ల వీరేశ్వరస్వామిని ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది దర్శించుకొంటారు. ఆలయంలో వార్షికంగా ఐదురోజులపాటు జరిగే మహాశివరాత్రి, ద్వాదశ పుష్కర జలాభిషేకం, ఐదురోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్షపూజలకు ఇతర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచీ అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. 2003లో జరిగిన పుష్కరాల సమయంలో అధికారుల లెక్కల ప్రకారం లక్షకు పైగా భక్తులు వీరేశ్వరస్వామి వారిని దర్శించుకొన్నారు. ఇప్పుడు 12 రోజులలో సుమారు 6 లక్షల మంది హాజరవుతారని ఆలయాధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ఉన్నతాధికారులకు రూ.80 లక్షలు వ్యయమయ్యే ప్రతిపాదనలు పంపించారు. అయితే వాటి ప్రకారం నిధుల కేటాయింపు జరగడంలేదు. ఆలయానికి కేవలం రూ.8 లక్షలు కేటాయించారు. ఈ సొమ్ము కేవలం ఆలయానికి రంగులు వేయడానికి, ఆలయ ఆవరణలో పార్కింగ్ టైల్స్ వంటి పనులకే సరిపోతాయి. ఇంకా కల్పించాల్సిన అదనపు, అత్యవసర సౌకర్యాలకు నిధులు సమకూర్చడం ఆలయాధికారులకు భారమవుతుంది. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలికంగా బస చేసేందుకు షెల్టర్లు, రద్దీకి అనుగుణంగా వాహనాల పార్కింగ్ వంటి పనులు చేపట్టవలసి ఉంది.
 
 ఆదాయం ఘనమే..

 మురమళ్ల వీరేశ్వరునికి ప్రతి సంవత్సరం కల్యాణం టికెట్లు, 90 ఎకరాల మీద శిస్తు, హుండీ, ఇతర ఆదాయాలు కలుపుకొని రూ.కోటి 50 లక్షలు వస్తుంది. ఆదాయానికి తగ్గట్టు ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అటు పాలక మండలి, ఇటు అధికారులు విఫలమయ్యారు. రానున్న పుష్కరాల్లోనే స్వామి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
 
 రూ.80లక్షలకుప్రతిపాదనలు పంపాం...
 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం రూ.80 లక్షలు వ్యయమయ్యే పనులకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు  పంపాం. కానీ అధికారులు రూ.8 లక్షలు మంజూరు చేశారు. అవి ఆలయానికి రంగులు వేసి, ఆలయ ఆవరణలో టైల్స్ అమర్చేందుకు మంజూరు చేశారు. ఆలయంలో ప్రత్యేకంగా డార్మిటరీ, కల్యాణ బేడా మండపం ఎక్స్‌టెన్‌షన్, నూతనంగా అభిషేక మండపం, ఇతర ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపాం. అయినా దేనికీ అనుమతులు లేవు.
 - బళ్ల నీలకంఠం, ఆలయ కార్య నిర్వహణాధికారి
 

మరిన్ని వార్తలు