ఆధ్యాత్మిక కేంద్రంపై అలక్ష్యం

3 Feb, 2015 01:30 IST|Sakshi
ఆధ్యాత్మిక కేంద్రంపై అలక్ష్యం

 పిఠాపురం :కళా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మికతల సమ్మేళనం అయిన పిఠాపురంపై పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం శీతకన్ను వేసింది. పుష్కరాల్లో పితృ కర్మలకు ప్రాధాన్యమిచ్చే భక్తులు అందు నిమిత్తం పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్త నున్నారు. లక్షలాదిమంది పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అయినా ఇక్కడ భక్తులకు సౌకర్యాలు మచ్చుకైనా కనిపించడం లేదు. పురాతన చరిత్ర కలిగి, దక్షిణ కాశీగా వెలుగొందుతున్న పిఠాపురం పట్టణంలో త్రిగయలలో ఒకటైన పాదగయ స్వయంభూ క్షేత్రంగా ఇక్కడ వెలసిందని ప్రతీతి. శ్రీకుక్కుటేశ్వరస్వామి, శ్రీదత్తాత్రేయస్వామి, అష్టాదశపీఠాల్లో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠం. దేవేంద్రుడు స్థాపించిన పంచమాధవుల్లో ఒకరైన కుంతీ మాధవస్వామి గుడి ఇక్కడ ఉన్నాయి.
 
 శ్రీపాదశ్రీవల్లభుని జన్మస్థానమైన ఈ క్షేత్రాన్ని పుష్కర సమయంలో దర్శిస్తే ఇతోధిక పుణ్యమని పండితులు చెబుతారు. పితృముక్తికరమైన క్షేత్రాలు మూడు మాత్రమే ఈ భూమండలంపై ఉన్నాయని, అవి శిరోగయ (బీహార్), నాభీ గయ (ఒడిశా), పాదగయ (పిఠాపురం) అని పురాణాలు చెపుతాయి. సర్వలోక శుభంకరుడైన శంకరుడు లోకకల్యాణార్థం గయాసురుని సంహరించేందుకు కోడి రూపాన్ని ధరిస్తాడు. గయాసురుని కోరిక మేరకు లింగరూపుడై, స్వయంభువమూర్తియై శ్రీ కుక్కుట లింగేశ్వర స్వామిగా పాదగయ  క్షేత్రంలో వెలసినట్టు ప్రతీతి. ఇక్కడి దివ్యస్ఫటిక లింగమూర్తి అయిన  శ్రీ స్వామి వారు భక్తుల పాలిట కల్పతరువుగా ప్రసిద్ధి చెందారు.
 
 ప్రగాఢ విశ్వాసాలకు ఆలంబనం..
 ఇక భూమండలంపై ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠంగా పురుహూతికా పీఠం వెలుగొందుతోంది. ఈ అమ్మవారిని దర్శిస్తే సకల పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. దేవేంద్రుడు స్థాపించిన పంచమాధవుల్లో ఒకరైన శ్రీకుంతీమాధవ స్వామి ఆలయం ప్రాచీనతకు చిహ్నంగా. దత్తాత్రేయుడి జన్మస్థలంగా ప్రసిద్ధినొందిన పిఠాపురానికి పుష్కరాల సమయంలో వేలాది సంఖ్యలో భక్తులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచీ వస్తుంటారు. పుష్కరాల సమయంలో అయితే గోదావరి తరువాత ఏలా నది (పాదగయ)లో స్నానం చేయాలనే విశ్వాసంతో భక్తులు విధిగా పాదగయ పుష్కరిణిలో స్నానమాచరించి, పితృ కర్మలు చేయడం ఆనవాయితీ. పాదగయలో పితృ కర్మలు చేస్తే కచ్చితంగా పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయనేది ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడ సౌకర్యాల కల్పనకు, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడంతో రానున్న భక్తులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. పట్టణంలోని ఆలయాల్లో భక్తులు బస చేయడానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు.
 
 శిథిలావస్థలో ఆలయాలు..
 పాదగయ, కుంతీమాధవస్వామి, సకలేశ్వరస్వామి ఆలయాలతో పాటు పలు ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి గతంలో అధికారులు నివేదికలు పంపినా బుట్టదాఖ లయ్యాయి. రూ.కోట్ల ఆస్తులున్నా కొన్ని ఆలయాల్లో నిత్య ధూపదీపనైవేద్యాలకే నిధులు లేక, నిత్య పూజలు కూడా చేయలేని దు స్థితి ఉంది. పాదగయ పుష్కరిణి అబివృద్ధికి నోచుకోక నీరు ప ట్టుమని పదిరోజులు కూడా స్వచ్ఛంగా ఉండడం లేదు. ఈ పు ణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు చుట్టుపక్కల రహదారులు నరకం చూపించనున్నాయి. ఉత్తిపూడి నుంచి కాకినాడ మీదుగా వెళ్లే 21 6 జాతీయ రహదారిపై అవస్థలమయమైంది. ఎన్నేళ్లయినా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. రాజమండ్రి నుంచి  సామర్లకోట మీదుగా పి ఠాపురం వచ్చే ఆర్ అండ్ బీ ర హదారి అబివృద్ధి పనులు నెలల తరబడి నత్తనడకన జరుగుతున్నాయి. పుష్కరాల నాటికైనా పూర్తి కాకపోతే ఇబ్బందులు తప్పవు.
 

>
మరిన్ని వార్తలు