గోదావరి ఉగ్రరూపం దాల్చింది

4 Aug, 2013 05:06 IST|Sakshi
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 61.5 అడుగుల నీటిమట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో నీటిమట్టం నమోదుకావటంతో భద్రాచలం డివిజన్‌లో ఎటు చూసినా  నీరే కనిపిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 14 మండలాల్లో 200 గ్రామాలు నీటమునిగాయి. వరద ఉప్పెనలా వచ్చి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతోంది. ముంపునకు గురైన గ్రామాల ప్రజలు వరదలో చిక్కుకొని ఎటూ పోలేక భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. 2006లో 66.9 అడుగుల నీటిమట్టం నమోదైనప్పటికీ ఈ స్థాయిలో గ్రామాలు ముంపునకు గురికాలేదని ఈ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదతో భద్రాచలం పట్టణంలోని కాలనీలు కూడా నీటమునిగాయి. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో 200 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. స్నానఘట్టాల వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు పూర్తిగా నీటమునిగాయి. 
 
 కరకట్ట స్లూయిస్ నుంచి లీకేజీతో పాటు సుభాష్ నగర్ కాలనీ నుంచి వరద నీరు పట్టణంలోకి వస్తుండటంతో రామాలయం పరిసర  ప్రాంతాలు నీటమునిగాయి. రామాలయానికి రెండు వైపులా వరద నీరు చేరటంతో పాటు విస్తాకాంప్లెక్స్ దుకాణ సముదాయాలు, ఇళ్లు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఉత్తర ద్వారం దాటి ఓం శాంతి సత్రం వరకూ వరద నీరు రావటంతో పరిసర ఇళ్ల వారు తీవ్రభయాందోళన  చెందుతున్నారు. శ్రీసీతారాముల కల్యాణం జరిగే మిథిలా స్టేడియం చుట్టూ వరద నీరు చేరింది. రామాలయం వద్ద ముంపునకు గురైన బాధిత కుటుంబాల వారిని తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి తరలించారు. అదే విధంగా సుభాష్ నగర్ కాలనీ వాసులను జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. చూస్తుండగానే వరద నీరు ఇళ్లను ముంచెత్తటంతో సామాన్లు  తీసుకునే అవకాశం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పీకల్లోతు నీటిలోంచి ఈదుకుంటూ వెళ్లి సామాన్లు తెచ్చుకున్నారు. 
 
 ప్రమాదపుటంచున గ్రామాలు :
  భద్రాచలం డివిజన్‌లోని వాజేడు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. కూనవరం గ్రామంలోకి కూడా వరద నీరు చేరటంతో ఇళ్లను వదలి సమీపంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి,  అటవీశాఖ కార్యాలయాలకు బాధితులు పరుగులు తీశారు. వీఆర్‌పురం మండలంలో ఒడ్డిగూడెంతో పాటు కొండరెడ్ల గ్రామాలకు ఎటు దారిలేకుండా పోయింది. ఈ గ్రామాల ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మూడు రోజులుగా కాలం వె ళ్లదీస్తున్నారు. ఇక వాజేడు మండ లంలోని దాదాపు అన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లైంది. ఏ గ్రామంలోని ప్రజలు అక్కడనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం పాల్వంచ డివిజన్‌లలోని 14 మండలాల్లో94 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4500 కుటుంబాల వారిని సురిక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. వీటిలో 16వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లుగాా జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ ప్రకటించారు. అదే విధంగా 55 చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరినట్లుగా ఆయన తెలిపారు. 
 
 ముంపు ప్రాంతాలకు వెళ్లని అధికారులు :
 జిల్లా యంత్రాంగమంతా భద్రాచలంలోనే మకాం వేసినప్పటికీ ముంపు ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాజేడు మండల సెక్టోరియల్ అధికారి మూడు రోజులైనా అటువైపు వెళ్లలేదు. వాజేడు మండలంలో ముంపు తీవ్రంగా ఉన్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. పదిచోట్ల పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 330 మంది ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నప్పటికీ ఒక్క దూలాపురంలో మినహా మిగతా చోట్ల ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూడా ఎటువంటి నిత్యావసర సరుకులు అందజేయలేదు. వాజేడు మండలంలో  ఏర్పాటు చేసిన శిబిరాల్లో కేవలం తాగునీటి ప్యాకెట్లు మాత్రమే అందజేశారు. దీంతో ప్రజలు తిండిలేక ఆకలితోనే అలమటిస్తున్నారు.
 
 అదే విధంగా కూనవరం మండలాన్ని కూడా వరద ఒక్కసారిగా చుట్టిముట్టడంతో వారికి సరిపడా పునరావస శిబిరాలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కూడా ఎటువంటి సహాయం అందచేసేందుకు అధికారులు ముందుకు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ముంపునకు గురైనప్పటికీ అధికారులు ఇటువైపు రాకపోవటంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం మండలంలోని రాయన్‌పేటలో ఇళ్లు ముంపునకు గురయ్యాయని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఏ ఒక్కరూ రాలేదని గ్రామస్తులు తెలిపారు. విపత్తు సమయంలో  అధికార యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతోనే ఇటువంటి సమస్య వచ్చిపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాలకు తక్షణమే ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు అధికాారులు తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉంది.
 
మరిన్ని వార్తలు