మళ్లీ గోదారి వరద 

17 Aug, 2019 11:12 IST|Sakshi
దేవీపట్నంలోని పంటపొలాల్లో చేరిన గోదావరి వరదనీరు

సాక్షి, తూర్పుగోదావరి(రంపచోడవరం) : గోదావరి నదికి మరోసారి వరద నీరు పోటెత్తడంతో దేవీపట్నం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గురువారం సాయంత్రం నుంచి మళ్లీ గోదావరికి వరదనీరు పెరుగుతూ రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దేవీపట్నంలో రాకపోకలు స్తంభించాయి. వీరవరం నుంచి, తొయ్యేరు మధ్యలో తొయ్యేరు ఆర్‌అండ్‌బీ చప్టా వద్ద పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరింది. దండంగి వాగు పోటెత్తింది. దండంగి నుంచి పోశమ్మగండి మార్గంలో రహదారిపై వరదనీరు చేరడంతో మైదాన ప్రాంతానికి రాకపోకలు స్తంభించాయి. దేవీపట్నం, పూడిపల్లి, పోశమ్మగండి, ఏనుగులగూడెం, గానుగులగొంది, అగ్రహారం, మూలపాడు, పెనికలపాడు, మంటూరు తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత వరద వల్ల తొయ్యేరు ఎస్సీ కాలనీలోను, దేవీపట్నం జాలరిపేటలో పలు ఇళ్లు నీట మునిగాయి.

దేవీపట్నం వద్ద రేషన్‌ డిపో వరకూ వరద నీరు పోటెత్తింది. పోశమ్మగండి వద్ద గట్టును తాకుతూ వరద నీరు ప్రవహిస్తూ శుక్రవారం సాయంత్రానికి స్వల్పంగా వీధుల్లోకి నీరు చేరింది. తొయ్యేరు వద్ద జూనియర్‌ కళాశాల ఆవరణలోకి వరదనీరు చొచ్చుకు వచ్చింది. వరద తాకిడికి గురయ్యే గ్రామాల్లో సెక్టోరియల్‌ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయా గ్రామాలకు నిత్యం 50 వేల వాటర్‌ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయానికి 41 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమంగా తగ్గడంతో దేవీపట్నంలో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేవీపట్నం వద్ద శుక్రవారం సాయంత్రం వరకూ వరద పెరిగి రాత్రికి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ముంపు గ్రామాల్లో ఇప్పటికే కూలిపోయిన ఇళ్లు, నీట మునిగిన పంటలను లెక్కించేందుకు ఏర్పాటు చేసిన బృందాలు నష్టం వివరాలు సేకరిస్తున్నాయి.

వరదనీటిలో కనకాయలంక కాజ్‌ వే
పి.గన్నవరం: వశిష్ట, వైనతేయ నదీపాయల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చాకలిపాలెం శివారులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్‌ వే పైకి శుక్రవారం వరదనీరు చేరుకుంది. దీంతో దొడ్డిపట్ల రేవుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు