పెరుగుతున్న గోదావరి ఉధృతి

3 Aug, 2019 12:08 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాజమండ్రి వద్ద  గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరో 24 గంటల్లో వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులు ఉండగా గంట గంటకు ఉధృతి పెరుగుతూ నది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం ఇప్పటికే 10.6 అడుగులకు చేరడంతో బ్యారేజ్  175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. సాయంత్రానికి నీటిమట్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదారి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. 

 

మరిన్ని వార్తలు