గోకరాజు భవంతికి అనుమతే లేదు

28 Jul, 2019 15:39 IST|Sakshi

మరో భవంతిని కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు

కరకట్ట సమీపంలోని భవనాలు కృష్ణా నది ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి

చట్టం నుంచి తప్పించుకునేందుకే ఈ పిటిషన్లు వేశారు

అందువల్ల ఈ వ్యాజ్యాలను కొట్టేయండి

హైకోర్టులో సీఆర్‌డీఏ కౌంటర్లు

సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్‌ నెంబర్‌ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్‌ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్‌ నెంబర్‌ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. 

అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్‌సీసీ రూఫ్‌తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది.

హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు
కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్‌డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్‌ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించింది. 

ఈ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ డైరెక్టర్‌ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్‌ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్‌ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్‌ సీనియర్‌ సిటిజన్‌ అని, ఆయన కుమారుడు సింగపూర్‌లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్‌ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు.  

మరిన్ని వార్తలు