అడ్మిషన్లు తెస్తే కమీషన్లు..

24 Aug, 2018 12:39 IST|Sakshi
విద్యార్థులను విచారిస్తున్న డీఎస్పీ గురుమూర్తి  

తెచ్చాక కులం పేరుతో  వేధిస్తున్న హెచ్‌ఓడీ

డీఎస్పీ విచారణలో వెలుగు   చూసిన వైనం

బొబ్బిలి విజయనగరం : గోకుల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను అడ్మిషన్లకు వినియోగించుకుంటున్నారని పలువురు విద్యార్థులు ఎస్సీ,  ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ గురుమూర్తికి స్పష్టం చేశారు. గురువారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల వసతిగృహంలో ఆయన విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏడుగురు విద్యార్థుల నుంచి వాంగ్మూలం సేకరించారు.

విచారణలో విద్యార్థులు చెప్పిన వివరాల్లోకి వెళితే... కళాశాలలో థర్డ్, ఫైనల్‌ ఇయర్‌ బీ ఫార్మసీ చదువుతున్న తమను అడ్మిషన్లు తీసుకురావాలని హెచ్‌ఓడీ కోట్ల సురేష్, తదితరులు ఆదేశించారన్నారు. ఇలా చేస్తే కమీషన్లు ఇస్తామని నమ్మబలికారని తెలిపారు.  దీంతో తాము అడ్మిషన్లు తీసుకువచ్చి, కమీషన్‌ కోసం  అడిగితే నువ్వు తెచ్చావన్న రుజువేంటని దబాయించారని వాపోయారు.

పైగా తమను కులం పేరుతో దూషించారని చెప్పారు. ఎస్సీలమైన తమతో ఇతర విద్యార్థులు భోజనం చేయకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బూర్లె గోవింద్‌ అనే సీనియర్‌ విద్యార్థి సోదరికి రక్తం అవసరం కావడంతో తాము రక్తదానం చేశామని, ఇది తెలుసుకున్న హెచ్‌ఓడీ కోట్ల సురేష్‌ ఎస్సీల రక్తం మనకెందుకురా.. బీసీలది తీసుకోవాలిగా అని ఆ విద్యార్థినిని మందలించారని తెలిపారు.

తెచ్చిన అడ్మిషన్లపై కనీసం స్పందించకుండా యాజమాన్యం ఇచ్చిన కమీషన్లు హెచ్‌ఓడీ తీసుకుని తమను వేధించినట్లు విద్యార్థులు డీఎస్పీకి  వివరించారు. మా కన్నా హాజరు శాతం తక్కువ ఉన్న వారిని ప్రమోట్‌ చేస్తూ మమ్మల్ని మాత్రం ఓ వైపు కాండినేషన్‌ ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. 

రశీదులు ఇవ్వలేదు.. 

కమీషన్‌ ఇస్తామని మా చేత అడ్మిషన్లు చేయించుకుని హాజరు తక్కువైతే తమవద్ద కాండినేషన్‌ ఫీజు కింద రూ.5 వేల చొప్పున తీసుకున్న హెచ్‌ఓడీ కనీసం మాకు రశీదులు కూడా ఇవ్వలేదని విద్యార్థులు గణేష్, గౌతమ్‌ తదితరులు తెలిపారు. అతన్నితొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.  

ఎగ్జామ్స్‌ కూడా రాయించలేదు..

కమీషన్లు అడిగామనే అక్కసుతో తమను త్రీ వన్‌ సెమ్‌ పరీక్షలకు అనుమతించలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై డీఎస్పీ గురుమూర్తి మాట్లాడుతూ, కేసును విచారించి నివేదిక ఇచ్చేందుకు రెండు నెలల సమయముందన్నారు. అన్నింటా క్షుణ్ణంగా విచారించి కోర్టుకు నివేదిస్తానన్నారు. ఏడుగురి విద్యార్థుల వాంగ్మూలాన్ని సేకరించి ఫైల్‌ చేస్తున్నామన్నారు. 

చర్యలు తీసుకోవాలి : 

గోకుల్‌ కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న హెచ్‌ఓడీ కోట్ల సురేష్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్‌ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కళాశాలలో చోటుచేసుకున్న అక్రమాలు, అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తున్నారన్నారు. వేధింపులకు గురైన విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయడం హర్షణీయమన్నారు. డీబీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ గంట సురేష్, కుప్ప తవిటిరాజు, తదితరులు విద్యార్థులకు మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు