‘స్వర్ణమయ’కు శ్రీకారం

6 Aug, 2013 00:46 IST|Sakshi

ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే బృహత్తర కార్యానికి సోమవారం శ్రీకారం చుట్టారు. శ్రీవారి శేషాచలకొండపై దేవస్థానం ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు స్వర్ణమయ పథకాన్ని ప్రారంభించి తొలి విరాళాన్ని దేవస్థానం ఈవో త్రినాథరావుకు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం విరాళాలు, సేవల రుసుములు,ఫిర్యాదులు, సలహాల స్వీకరణ,  ఆలయంలో జరిగే ఉత్సవాల వీక్షణకు ఏర్పాటు చేసిన ఏపీ ఆన్‌లైన్ సేవలను కూడా ఆయన ప్రారంభించారు. సుధాకరరావు మాట్లాడుతూ.. విమాన గోపురానికి బంగారు తాడపం చేయించాలని ట్రస్టుబోర్డు నిర్ణయం తీసుకుందని, ఇందుకు రూ. 6 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు.  ఈ పథకంలో భక్తులను భాగస్వాములను చేసేందుకు వారి నుంచి బంగారం లేదా రూ. 1,116 ఆపైన విరాళాలు స్వీకరించనున్నట్లు వివరించారు.
 
 విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయటం రెండేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. భక్తులకు ఇచ్చే దేవస్థానం గదుల రిజర్వేషన్లు, దేవస్థానం, ఆలయ ఇతర సేవలు పొందేందుకు  విదేశాలు, దూర ప్రాంతాల వారికి వెసులుబాటు కోసం ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ సేవలు దేవస్థానం అధీనంలో ఉండేలా ప్రత్యేక గేట్‌వే కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలు విజయవాడ, భద్రాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని దేవస్థానాల్లో ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రగతి పథంలో ఉందన్నారు. గో సంరక్షణ, కాటేజీల నిర్మాణం, వైఖానస ఆగమ పాఠశాల నిర్వహణలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. స్వర్ణమయ పథకానికి శ్రీవారి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు వేగేశ్న ఆనందరాజు తనతోపాటు  ఆయన బంధువులు 18 మంది పేరున విరాళం అందించారు. మిగిలిన ట్రస్టుబోర్డు సభ్యులు, గ్రామస్తుడు తరగళ్ల శ్రీనివాస్ తదితరులు విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ భాస్కర్, ట్రస్టుబోర్డు సభ్యులు వెంపరాల నారాయణమూర్తి, కూరాకుల వీరవెంకట సత్యనారాయణ, వుద్దాల నాగవెంకట కనకదుర్గవల్లి, కటకం కృష్ణవుూర్తి, వీవీఎస్‌ఎన్ వుూర్తి, పర్వతనేని శ్రీని వాసరావు, వేగేశ్న ఆనందరాజు, మెరజోతు రాములునాయుక్ తదితరులు పాల్గొన్నారు
 

మరిన్ని వార్తలు