పుత్తడి దిగివస్తోంది

9 Nov, 2014 03:28 IST|Sakshi
పుత్తడి దిగివస్తోంది

ఆర్నమెంట్ బంగారం వ్యాపారంలో దగా
 
 కర్నూలు(అగ్రికల్చర్):  
 బంగారం ధరలు దిగి వస్తుండటంతో వినియోగదారులు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వివాహాలు వంటి శుభకార్యాలు లేకపోయిన ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోళ్లు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ధరలు మరింత తగ్గవచ్చుననే ఉద్దేశంతో కొందరు వేచి చూస్తుండగా, మరికొందరు మళ్లీ పెరుగుతుందేమోనన్న భయంతో కొంటున్నట్లు తెలుస్తోంది.

ఒక దశలో ఆర్నమెంటు బంగారం ధర రూ.30 వేలకు వెళ్లింది. కొద్ది రోజులు తగ్గుతూ వస్తున్న ధరలు కనిష్ట స్థాయికి తగ్గడం విశేషం. గురువారం 24 క్యారెట్ల(ప్యూర్) బంగారం ధర రూ.26 వేలు ఉండగా, 22 క్యారెట్ల(ఆర్నమెంటు) బంగారం ధర రూ.23,950కి తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బంగారం వ్యాపారానికి కర్నూలు కేంద్ర బిందువు వంటిది. ప్రత్యేకంగా షరాఫ్ బజార్ ఉండటం, కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలు భారీగా వెలియడంతో నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికే వస్తున్నారు.
 
  నగలు, ఆభరణాలను ఆర్నమెంటుగా బంగారంగా వ్యవహరిస్తారు. ఇందులో బంగారం 91.6 ఉంటే దానిని 22 క్యారెట్లుగా పరిగణిస్తారు. హాల్‌మార్క్ ఉంటే అటువంటి నగలను 91.6 ప్యూరిటిగా భావిస్తారు. కార్పొరేట్ దుకాణాల్లో హాల్ మార్కు ఆభరణాలు, నగలు విక్రయిస్తూ 91.6 ప్యూరిటీ పాటిస్తుండగా, ఇతర జ్యువెలరీ దుకాణాల్లో మాత్రం వ్యాపారులు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కర్నూలులో కార్పొరేట్ దుకాణాలు మినహా మిగిలిన వాటిల్లో చాలా వరకు 70 నుంచి 75 శాతం బంగారం కలిగిన ఆభరణాలను విక్రయిస్తున్నారు. అంటే బంగారం వ్యాపారంలో 50 శాతం వరకు 14 నుంచి 18 క్యారెట్లు బంగారం ఉన్న వ్యాపారమే జరుగుతోంది. వ్యాపారులు వినియోగదారుల నుంచి 22 క్యారెట్ల ధరను దీనికి అదనంగా 6 నుంచి 16 శాతం తరుగును వసూలు చేస్తుండటం గమనార్హం.

వినియోగదారులు 15 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధరను చెల్లిస్తున్నారంటే ఎంత దారుణంగా మోసపోతున్నారో తెలుస్తోంది. జ్యువెలరీ వ్యాపారులు అమ్మే బంగారంలో 916 ప్యూరిటీ పాటిస్తున్న.. లేదా అనే దానిపై నిఘా లేకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 
 ఆర్నమెంటు బంగారం ధరకు తరుగు అదనం
  వ్యాపారులు ఆర్నమెంటు బంగారం ధరకు తరుగు, కూలీ ఖర్చులను కలుపుతారు. ప్రస్తుతం నగలను బట్టి 5 నుంచి 16 శాతం వరకు తరుగు కలుపుతునారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కొంటే నగను బట్టిరూ.1500 నుంచి రూ.3400 వరకు తరుగు పేరుతో కలుపుతారు.
 
 వినియోగదారుల్లో చైతన్యం రావాలి
  కొనే బంగారం తగిన నాణ్యతతో ఉందా లేదా
   అనే దానిని వినియోగదారులే పరిశీలించుకోవాలి.
 హాల్‌మార్కు కలిగిన బంగారం ఆభరణాలు
  916 ప్యూరిటీ గలవిగా భావించారు.
  కొన్న వాటికి విధిగా ఆథరైజ్డ్ బిల్లు తీసుకోవాలి.
 బిల్లులో బంగారంలో ఎంత ప్యూరిటీ ఉన్నది కూడా పేర్కొనాల్సి ఉంది.

మరిన్ని వార్తలు