లక్ష్మీకాసుల హారం దొరికిందట!

10 May, 2014 04:24 IST|Sakshi

తిరుచానూరు, న్యూస్‌లైన్: మూడు రోజుల క్రితం మాయమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి లక్ష్మీకాసుల హారం శుక్రవారం ప్రత్యక్ష మైంది. ఆలయంలోని గర్భగుడిలోనే ఉందని అర్చకులు వెల్లడించారు.   పద్మావతి అమ్మవారి మూలమూర్తికి కవచాలు, హస్తాలు, కాసులహారం, మంగళసూత్రం వంటి దాదాపు 18 రకాల బంగారు ఆభరణాలు నిత్య అలంకరణగా వాడతారు. ప్రతి శుక్రవారం అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో మాత్రమే ఈ ఆభరణాలను తీసి గర్భగుడిలోనే ఉన్న నగల పెట్టెలో భద్రపరుస్తారు. ఈనెల 13 నుంచి జరగనున్న వసంతోత్సవాల సందర్భంగా 6వ తేదీ ఉదయం ఆలయంలో కోయిల్‌ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు.
 
 ఆ సమయంలో అమ్మవారి నగలన్నిం టినీ తీసి పెట్టెలో భద్రపరిచారు. ఆరోజు సాయంత్రం అమ్మవారి లక్ష్మీకాసుల హారం మాయమైనట్టు అర్చకులు గుర్తించి అధికారులకు సమాచారం చేరవేశారు. గురువారం ఈ విషయం  బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గర్భాలయాన్ని శుద్ధి చేశాక, నీరు వెళ్లే తూములో హారం ఇరుక్కు పోయిందని అర్చకులు చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారం పై టీటీడీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి నట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు