మఠం మాయాజాలం

11 Jul, 2020 09:14 IST|Sakshi

మళ్లీ వార్తల్లోకెక్కిన హథీరాంజీ మఠం

భక్తులిచ్చిన కానుకల భద్రతపై సర్వత్రా అనుమానాలు

స్పందించని నిర్వాహకులు

హథీరాంజీ మఠం వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. విలువైన భూములు,ఆభరణాలను నిర్వాహకులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయని ఆరోపణలు వస్తున్నా నిర్వాహకులు నోరు మెదపకపోవడంఅనుమానాలకు తావిస్తోంది.  

సాక్షి, తిరుపతి : హథీరాంజీ మఠం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమల జపాలి ఆంజనేయస్వామికి రామ్మూర్తి అనే భక్తుడు సమర్పించిన 108.76 గ్రాముల బంగారు ఆభరణం కనిపించకుండా పోయిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరు కిరీటం అంటుంటే, ఇంకొందరు ఆభరణమని, మరికొందరు బంగారుపళ్లెం అని అంటున్నారు.

కానుకలు, ఆస్తులు భద్రంగా ఉన్నాయా?
కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వర స్వామికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలు, వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు, నెక్లెస్‌లు ఉన్నాయి. ఇందులో అత్యంత విలువైన పచ్చ, బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి పాలతో నైవేద్యం ఇచ్చేవారట. పాలలో ఎవరైనా విషం కలిపితే పాలు రంగుమారినట్లుగా కనిపించేదట. అందుకే ఆ పాత్రకు అత్యంతప్రాధాన్యత ఉండేది. తిరుమల జపాలిలో వెలసిన ఆంజనేయస్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించినట్లు మఠం అధికారులు చెబుతున్నారు. కానుకలు, ఆస్తుల వివరాలన్నీ రికార్డుల్లో నమోదు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆ వివరాలు బయటకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

చుట్టుముడుతున్న వివాదాలు
1968లో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కొందరిపై కేసులు నమోదైనట్లు తెలిసింది. దాంతో 1968, 1969 ప్రాంతంలో స్వామి వారికి వచ్చిన ఆభరణాలను తిరుపతి, చంద్రగిరిలోని ఎస్‌బీఐలో భద్రపరిచారు. ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నగలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్లను దేవదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంతో పాటు హథీరాంజీ మఠంలో ఉంచినట్లు తెలిసింది. 1975లో హథీరాంజీ మఠానికి మహంతుగా దేవేంద్రదాస్‌ నియమితులయ్యారు. బ్యాంక్‌ లాకర్లలో ఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్‌ పట్టాభిషేకానికి వినియోగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు బంగారు నగలను ఎవరికీ చూపకపోవడంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.

ఎందుకు దాస్తున్నారు?
ప్రస్తుత మహంతు అర్జున్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం తెలి సిందే. ఒక రోజు ముందే విషయం తెలుసుకున్న ఆయన కనిపించకుండాపోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. ఆ తర్వాత మఠం ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న ఆభరణాల లెక్క లు తీసేలోపే అర్జున్‌దాస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తిరిగి విధుల్లో చేరారు. అర్జున్‌దాస్‌ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో మఠంలో దాగిన గుట్టు బయటకు రాకుండాపోయింది. తాజాగా మరో బంగారు ఆభరణం కనిపించికుండాపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసు కుని భక్తులు స్వామి వారికి సమర్పించిన విలువైన భూ ములు, వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలను కాపాడాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు