బరిలోకి దిగితే బంగారు పతకమే

15 Feb, 2014 00:40 IST|Sakshi
బరిలోకి దిగితే బంగారు పతకమే

 బరిలోకి దిగితే బంగారు పతకమే!
 గుంటూరు స్పోర్ట్స్,
 అథ్లెటిక్స్ ట్రాక్‌లో అడుగుపెడితే బంగారు పతకాన్ని సాధించడం ఖాయం. ఆ పసిడి పతకాల విజయపరంపరే ఆయన ఇంటిపేరును సైతం గోల్డ్‌గా మార్చేసింది. ఆయనే గుంటూరుకు చెందిన వెటరన్ అథ్లెట్ తోట సుబ్బారావు అలియాస్ గోల్డ్ సుబ్బారావు. గుడికి వెళ్లడం కంటే గ్రౌండ్‌కు వెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటున్న సుబ్బారావు విజయగాథ ఇదీ...
 మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన తోట సుబ్బారావు అమినాబాద్‌లోని స్కూల్‌లో విద్యనభ్యసిస్తూ అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందారు. స్కూల్ స్థాయి టోర్నమెంట్‌లో రెండు రజత, ఒక కాంశ్య పతకాలు సాధించడంతోపాటు స్కూల్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పేదరికం వల్ల పదో తరగతితో చదువు ఆపేసి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే పేరేచర్లలోని ఎస్‌జీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్‌లో సాధన కొనసాగిస్తూ అనేక పతకాలు సాధించారు. ఇటీవల గుంటూరులో స్థిరపడ్డాక స్థానిక ఎన్టీఆర్‌స్టేడియంలో సాధన కొనసాగిస్తున్నారు. సీనియర్ వెటరన్ క్రీడాకారుడు సత్యనారాయణరెడ్డి ప్రొత్సాహంతో 2005 నుంచి రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌లలో పాల్గొని 21 బంగారు, ఏడు రజత, ఒక కాంశ్య పతకాలు ఆయన సాధించారు.  జాతీయ స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఒక బంగారు, ఒక కాంస్య పతకాన్ని కైవశం చేసుకున్నారు. వెటరన్ విభాగంలో 200, 400, 800 మీటర్ల పరుగు పందెంలో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈపూరులో జరిగే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని మరికొన్ని పతకాలు తన ఖాతాలోకి వేసుకొనేందుకు కఠోర సాధన           చేస్తున్నారు.  
 ఇదీ ఆశయం..
 జయ్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి వెటరన్ టోర్నమెంట్‌లో బంగారు పతకాలు సాధించేందుకు నిరంతరం సాధన చేస్తున్నాను.    అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కనబర్చిన అండర్-14, 16 విభాగాల్లో 20 మంది అథ్లెట్సిను దత్తత తీసుకుని వారికి అవసరమైన పౌష్టికాహారం, క్రీడా దుస్తులు అందించి, అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది జిల్లాను అథ్లెటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలపాలన్నదే నా ఆశయం. దీనికి త్వరలో శ్రీకారం చుడతాను.
 - తోట సుబ్బారావు

మరిన్ని వార్తలు