అక్రమార్కులపై కొరడా

9 Nov, 2014 03:16 IST|Sakshi
అక్రమార్కులపై కొరడా

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ వాణిజ్య భవనాలపై కొరడా ఝళిపించేందుకు కర్నూలు నగరపాలక సంస్థ యంత్రాంగం సిద్ధమైంది. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని వాణిజ్య సముదాయాన్ని(కమర్షియల్ కాంప్లెక్స్) నిర్మించుకున్న అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం పక్కాగా పథక రచన చేసింది. ప్రధానంగా నగరంలోని ఐదు వాణిజ్య మార్గాల్లో సర్వే చేపట్టేందుకు నిర్ణయించింది.

సర్వేలో వాణిజ్య సముదాయాల ఫొటోలను తీసి డిజిటలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో వివరాలు సేకరించి క్రోడీకరించనున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని వాణిజ్య సముదాయాల వివరాలను డిజిటలైజ్ చేసి.. భండారం బయటపెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

 ఉమ్మడి నిర్ణయం
 అక్రమ వాణిజ్య భవనాలపై చర్యలకు విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగేందుకు పురపాలకశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా సర్వే చేయనున్న ఐదు ప్రధాన మార్గాల్లోని వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్ ఎందుకోసం తీసుకున్నారనే వివరాలను విద్యుత్‌శాఖ నుంచి సేకరిస్తారు. అంటే.. గాయత్రి ఎస్టేట్ వద్ద ఫలానా షాపునకు గృహ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? వాణిజ్య విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? అనే వివరాలను తీసుకుంటారు.

అదేవిధంగా ఫలానా బిల్డింగ్‌లో ఏయే షాపులకు అనుమతి తీసుకున్నారనే వివరాలను వాణిజ్యపన్నులశాఖ నుంచి సేకరిస్తారు. ఆ తర్వాత సర్వే ద్వారా తీసుకున్న డిజిటల్ చిత్రాలు-విద్యుత్ కనెక్షన్ వివరాలు, వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న అనుమతి వివరాలను క్రోడీకరించి పక్కాగా నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా పట్టణ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి ఎందుకు తీసుకున్నారనే వివరాలను పోల్చి... అక్రమ వాణిజ్య భవనాలను గుర్తించనున్నారు.

ఈ విధంగా గుర్తించిన భవనాలపై వాస్తవంగా వాణిజ్య భవనానికి చెల్లించాల్సిన పన్ను కంటే అదనంగా 100 శాతం వసూలు చేయనున్నారు. ఎప్పటి నుంచి వాస్తవంగా పన్ను చెల్లించాలనే వివరాలను సేకరించి అంత బకాయి మొత్తాన్ని వడ్డీ సహా వసూలు చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నగరంలో మొదటి దశగా ప్రధాన వాణిజ్య సముదాయాలున్న ఐదు మార్గాలపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది.

ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల ఉన్న వాణిజ్య సముదాయాల వివరాలు, ఫొటోలను తీసి క్రోడీకరిస్తారు. రెండో దశలో మునిసిపాలిటీ పరిధిలోని మొత్తం వాణిజ్య భవనాల వివరాలను సేకరించి ఆన్‌లైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎవరైనా గృహాన్ని నిర్మిస్తామని తక్కువ పన్ను చెల్లించే ప్రయత్నం చేస్తే అడ్డుకట్ట వేయాలనేది మున్సిపల్ అధికారుల ప్రణాళికగా తెలుస్తోంది.
 
 నగరంలో సర్వే నిర్వహించనున్న ఐదు ప్రధాన మార్గాలు

 
 1. సుంకేసుల రోడ్డు నుంచి మదర్ థెరిస్సా విగ్రహం మీదుగా వాణిజ్యపన్నులశాఖ. అక్కడి నుంచి వైఎస్సార్ విగ్రహం.. రాక్‌వుడ్ పాఠశాల.. మౌర్య ఇన్.. రాజ్ విహార్.. కిడ్స్‌వరల్డ్.. రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా రాజ్ థియేటర్.
 2. కింగ్ మార్కెట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా కొండారెడ్డి బురుజు. అక్కడి నుంచి కోట్ల సర్కిల్ మీదుగా కిడ్స్‌వరల్డ్.
 3. రైల్వే స్టేషన్ రోడ్డు-బంగారుపేట నుంచి బళ్లారి జంక్షన్ మీదుగా రేడియో స్టేషన్.
 4. రాజ్‌విహార్-గౌరీ గోపాల్ ఆసుపత్రి, గాయత్రి ఎస్టేట్ మీదుగా గుత్తి పెట్రోల్ బంకు.
 5. గాయత్రీ ఎస్టేట్ నుంచి నంద్యాల రోడ్డు.

మరిన్ని వార్తలు