నమ్మితే ‘నయా’వంచన

9 Jan, 2014 05:40 IST|Sakshi
  • మాటల గారడీతో మాయ చేశాడు
  •      ఇత్తడి ఎరవేసి పుత్తడి దోచాడు
  •      సాయం చేస్తానని దగ్గరై దోచుకెళాడు
  •      నిందితుడిపై రెండుజిల్లాల్లో ఎనిమిది కేసులు
  •      పగటి దొంగను పట్టుకున్న వేములవాడ పోలీసులు
  • వేములవాడ, న్యూస్‌లైన్ : మిమ్మల్నిచూస్తే మంచివారిలా ఉన్నారు. నా వస్తువులు మీ దగ్గర దాచితే భద్రంగా ఉంటాయనిపిస్తుంది. ఏమాత్రం స్వార్థంలేని మనిషిలా ఉన్నారు మీరు. మీకు డబ్బిచ్చినా భద్రంగా తిరగిస్తారు... అబ్బో ఇలా పొగిడేస్తూంటే పడిపోని వారుంటారా. అందునా అమాయక జనాలైతే ఇట్టే నమ్మేస్తారు కదా. అవునండీ యూఏఈ ఎక్స్ఛేంజ్, బ్యాంక్, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడైనా సరే అతడు అమాయకులను ఇట్టే బుట్టలో పడేస్తాడు. తన ఒంటిపైనున్న రోల్డ్‌గోల్డ్ నగలు, ఉంగరాలూ ఏవడిగినా అడక్కపోయినా ఇట్టే ఒలిచి ఇచ్చేస్తాడు. నమ్మేసి మన ఒంటిపై నగలో, దాచుకున్న సొమ్మో ఇస్తే పత్తాలేకుండా పోతాడు. వేములవాడ సీఐ చల్లా దేవారెడ్డి నేతృత్వంలో పోలీసులు వలపన్ని పట్టుకున్న ఇతగాడి పేరు అబ్దుల్లాపూర్ చిన్నారెడ్డి. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కె). ఇతగాడి గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది కదూ..
     
    ఇలా కేసు నమోదు
    కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కౌసల్య (55) షోలాపూర్‌లో ఉన్న తమ బంధువల వద్దకు వెళ్లేందుకు కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. రైలొచ్చేదాకా వేచి ఉన్న సమయంలో చిన్నారెడ్డి ఆమె వద్దకు చేరుకున్నాడు. తనను తాను పరిచయం చేసుకున్న చిన్నారెడ్డి హైదరాబాద్ రైలుకోసం వేచి చూస్తున్నట్లు చెప్పాడు. ఎక్కడికెళ్తున్నారమ్మా అంటూ మాటలు కలిపాడు. ఆత్మీయ పలకరింపుతో కరిగిపోయిన కౌసల్య వివరాలన్నీ వెల్లడించింది. ఆమె ఫోన్‌నెంబర్ పొందిన చిన్నారెడ్డి ఆ తర్వాత పక్షం రోజుల తర్వాత డిసెంబర్ 18న ఆమెకు కాల్ చేశాడు. అప్పటికే తిరిగి కొడిమ్యాలకు చేరుకున్న కౌసల్య తను ఇంటివద్ద ఉన్నట్లు తెలిపింది. తాను వేములవాడకు వచ్చానని, తన కూతురికి బంగారు ఆభరణం చేయించాల్సి ఉందని పేర్కొన్నాడు. అయితే ఇక్కడి స్వర్ణకారులెవరూ తనకు పరిచయంలేదని, మీకు తెలిసిన వారుంటే పరిచయం చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన ఆమె వేములవాడకు వచ్చింది. ఆమెను కలిసిన చిన్నారెడ్డి కౌసల్య ఒంటిపైనున్న బంగారు ఆభరణం బాగుందంటూ మెచ్చుకున్నాడు. అదే డిజైన్‌ను తన కూతురికి చేయించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆమె నుంచి ఆభరణాన్ని పొందిన చిన్నారెడ్డి స్వర్ణకారుడికి ఈ డిజైన్ చూపించి వస్తానంటూ వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేదని కౌసల్య తాలూకూ సెల్‌ఫోన్ సహితం తీసుకెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవటంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
     
    ఎర వేశారిలా
    ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్థానిక సీఐ చల్లా దేవారెడ్డి నేతృత్వంలో రంగప్రవేశం చేశారు. చిన్నారెడ్డి తీసుకెళ్లిన కౌసల్య ఫోన్ ద్వారా చిన్నారెడ్డి వినియోగించే ఫోన్ నెంబర్లను సేకరించారు. ఇంతలోనే నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన నర్సయ్యను దోచుకునేందుకు చిన్నారెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా తన వద్దనున్న ఐదు తులాల బంగారాన్ని తీసుకుని రూ. లక్ష ఇవ్వాల్సిందిగా నర్సయ్యను కోరాడు. ఇచ్చేందుకు నర్సయ్య సిద్ధపడ్డాడు కూడా. ఈ విషయాన్ని పోలీసులు సెల్‌ఫోన్ ట్యాపింగ్ ద్వారా పసిగట్టారు. ఆ వెనువెంటనే నర్సయ్యవద్దకు చేరుకున్న పోలీసులు చిన్నారెడ్డి చేసే మోసాలను గురించి వివరించారు. తమకు సహకరించాల్సిందిగా కోరారు. నర్సయ్యతో మాట్లాడించి డబ్బు తీసుకెళ్లాల్సిందిగా చిన్నారెడ్డికి సమాచారం అందించారు. రెండు రోజుల తర్వాత వచ్చిన చిన్నారెడ్డిని పోలీసులు కామారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు.
     
     తీగ లాగితే...
     పోలీసు మార్కు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన నిందితుడు చిన్నారెడ్డి తన గుట్టు విప్పాడు. తీగలాగితే డొంక కదిలింది. మాయమాటలు చెప్పి చేసిన మోసాలను వివరించాడు. కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్‌లలో ఇతడిపై మొత్తం ఎనిమిది కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో తదుపరి విచారణకు చిన్నారెడ్డిని మరోసారి పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు