అడవివరంలో పట్టపగలే భారీ చోరీ

4 Jan, 2019 07:23 IST|Sakshi
చోరీ జరిగిన ఇంటిలో పరిశీలిస్తున్న క్రైం డీసీపీ దామోదర్, ఇతర సిబ్బంది

40 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు అపహరణ

విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): అడవివరంలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారిని ఆనుకుని పాత గోశాలకి సమీపంలో ఉన్న చందన హిల్స్‌ వీధిలో నివసిస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 40 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు అపహరించుకుని పోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆటోనగర్‌లో ఉన్న సాహువాలా సిలెండర్స్‌ కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు అడవివరంలోని చందన హిల్స్‌ వీధిలో సొంత ఇంట్లో భార్య ఉమాదేవి, కూతురుతో ఉంటున్నారు. సాంమమూర్తిరాజు గురువారం ఉదయం కంపెనీకి వెళ్లగా, కూతురు కళాశాలకి వెళ్లింది. భార్య ఉమాదేవి ఇంటికి తాళం వేసి ఉదయం 10 గంటల సమయంలో సింహగిరిపై జరిగిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాల కార్యక్రమానికి వెళ్లారు.

తిరిగి మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తాళం తీసి తలుçపు తొయ్యగా అది రాలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికీ రాకపోవడం, లోపల నుంచి వెలుగు వస్తుండటంతో వెనుక వైపుకి వెళ్లి చూశారు. వెనుక వైపున ఉన్న ద్వారం పూర్తిగా తెరిచి ఉండడంతో లోపలకి వెళ్లి చూడగా కింది బెడ్‌రూమ్, పై అంతస్తులోని బెడ్‌రూముల్లోని బీరువాల్లోని దుస్తులు చిందవరవదగా పడేసి ఉన్నాయి. బీరువాలోని నగలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని క్రైం డీసీపీ ఎ.ఆర్‌.దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, నార్త్‌ ఏసీపీ ఫల్గుణరావు, గోపాలపట్నం సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ తమ్మినాయుడు, పెందుర్తి ఎస్‌ఐ జి.డి.బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీంలు సభ్యులు తనిఖీలు చేశారు. ఇంటి వెనుక వైపు గ్రిల్, తలుపు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడినట్టు డీసీపీ తెలిపారు. ఎంతమేరకు బంగారం, నగదు పోయాయో లెక్క వేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు