ఊరెళ్లి వచ్చేలోపే ఊడ్చేశారు

18 Jan, 2019 07:21 IST|Sakshi
దొంగతనం జరిగిన ఇంట్లో పోలీసులు

విశాలాక్షినగర్‌లో పెళ్లివారింట భారీ దొంగతనం

కుమార్తె పెళ్లి కోసం సిద్ధం చేసిన రూ.10లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణ

ఆరిలోవ(విశాఖ తూర్పు): నగరంలోని ఆరో వార్డు పరిధి విశాలాక్షినగర్‌లో భారీ దొంగతనం జరిగింది. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేలోపే దొంగలు ఇంట్లోపడి దొరికినకాడికి ఊడ్చేశారు. డాగ్‌ స్క్వేడ్‌ గుర్తుపట్టలేని విధగా ఇంట్లో కారం, పసుపు చల్లేశారు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరో వార్డు పరిధి  విశాలాక్షినగర్‌ రామాలయం వీధిలో చెట్టుపల్లి వెంకటరావు కుటుంబంతో నివాసముంటున్నారు. ఆయన ఓ కనస్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. కుమార్తెకు ఈ నెల 21న వివాహం చేయాలని నిశ్చయించారు. అందుకోసం పెళ్లి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెళ్లి ఖర్చుల కోసం సేకరించిన రూ.10 లక్షలు, కుమార్తె కోసం ఇటీవలే  కొనుగోలు చేసిన 20 తులాల బంగారు ఆభరణాలు ఇంట్లో దాచిపెట్టారు. పండగకు ఆయన కుటుంబీకులు చోడవరం వెళ్లారు. బుధవారం ఇంటికి తాళంవేసి ఆయన కూడా ఊరెళ్లారు.

గురువారం మధ్యాహ్నం ఆ ఇంటి తలుపులు విరగ్గొట్టి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో దొంగతనం జరిగినట్లు భావించిన స్థానికులు చోడవరంలో ఉన్న వెంటకరావుకు తెలియజేశారు. దీంతో ఆయన తన కుటుంబంతో వెంటనే విశాఖలోని ఇంటికి చేరుకొన్నారు. తలుపులు తెరిచి ఉండటం, దుస్తులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండడాన్ని చూసి దొంగతనం జరిగినట్లు నిర్థారించుకొన్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోయేసరికి లబోదిబోమంటూ ఆరిలోవ పోలీసులకు  తెలియజేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సీసీఎస్‌ ఏసీపీ గోవిందరాజులు, ఆరిలోవ క్రైం సీఐ శ్రీనివాసరావు, క్రైం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సిబ్బందితో వెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన తీరు పరిశీలించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో క్లూస్‌ టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. దోచుకొన్న అనంతరం దొంగలు ఇంట్లో కారం, పసుపు చల్లేసి వెళ్లిపోయారు. దీంతో డాగ్‌స్క్వేడ్‌ పరిశీలనకు వీలులేకుండాపోయింది. వెంకటరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన రూ.10 లక్షలు నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగలు పట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. క్రైం ఎస్‌ఐ విజయకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు