పట్టుకోండి చూద్దాం..

29 Oct, 2013 03:02 IST|Sakshi

 శంషాబాద్, న్యూస్‌లై న్: ‘శత కోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న చందంగా ఉంది స్మగ్లర్ల తెలివి. సుంకం ఎగ్గొట్టేందుకు విదేశాల నుంచి బంగారాన్ని దుస్తుల్లో దాచుకొని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ విపణిలో బంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు దుబాయ్ టూ హైదరాబాద్ మార్గంలో అక్రమ మార్గంలో కిలోల కొద్ది బంగారాన్ని తరలిస్తున్నారు. ఇటీవల కస్టమ్స్ అధికారుల వలకు చిక్కిన స్మగ్లర్ల తీరే ఇందుకు నిదర్శనం. విజిటింగ్ వీసాలపై ప్రత్యేకంగా దుబాయ్, యూఏఈ, బ్యాంకాక్‌లకు వెళుతున్న స్మగ్లింగ్ ముఠాలు అక్కడి బంగారానికి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా నగరంలోని మార్కెట్‌కు తరలిస్తున్నారు.
 
 మన దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానమైంది. నగరంలో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర దాదాపు రూ. 31 వేల వరకు ఉంది. దుబాయ్‌లో అదే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 430 యూఎస్ డాలర్లు ఉంది. నగర మార్కెట్‌తో పోలిస్తే పది గ్రాముల బంగారానికి సుమారు ఆరువేల తేడా ఉంది. దీనికి తోడు దుబాయ్ నుంచి తీసుకొస్తున్న బంగారం బిస్కెట్‌ల రూపంలో ఉండడంతో నగర మార్కెట్‌లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. నగల షాపులతో పాటు నగరంలో పాతబస్తీలోని మార్కెట్‌లో దుబాయ్ బంగారానికి మంచి క్రేజ్ ఉండడంతో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ సాగుతున్నట్లు నిఘావర్గాలు దృష్టి సారిస్తున్నాయి. బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికే కొందరు పనిగట్టుకుని విదేశాలకు వెళ్లి వస్తునట్లు ఇప్పటికే ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈక్రమంలో ఇటీవల పలువరు కస్టమ్స్ అధికారులకు చిక్కారు.  
 
 రెండు నెలలు.. ఆరు ఘటనలు
 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు బంగారాన్ని అక్రమ మార్గంలో తరలిస్తూ ఆరుగురు పట్టుబడ్డారు. వీరిలో మహిళలూ ఉన్నారు. వీరంతా కస్టమ్స్ సుంకంపై అవగాహన లేని వారేమి కాదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో బంగారం తరలించిన వారు తాము వేసుకునే దుస్తుల్లో ప్రత్యేకంగా సంచులు ఏర్పాటు చేసుకున్నారు. దుస్తులు లేదా షూ హిల్స్ భాగంతో పాటు లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు.
 
 ఆగస్టు 21న పాతబస్తీ ప్రాంతానికి చెందిన రషీద్ సుమారు మూడు కేజీల బంగారాన్ని లో దుస్తులు, షూలో పెట్టుకుని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కొంతకాలానికి మరో ఇద్దరు ప్రయాణికులు అరకిలో బంగారంతో పాటు కాస్మోటిక్స్ వస్తువులతో బుక్కైన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు నగరానికి చెందిన దంపతుల వద్ద కూడా సుమారు మూడు కేజీల బంగారం బయటపడింది. ఆ మరుసటి రోజే హైదరాబాద్‌కు చెందిన తల్లీకూతుళ్ల నుంచి కస్టమ్స్ అధికారులు మరో అర కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం బ్యాంకాక్ నుంచి ఓ వ్యక్తి కేజీ బంగారంతో పాటు రంగురాళ్లు తీసుకొచ్చి అధికారులకు చిక్కాడు. ఇప్పటికైనా స్మగ్లర్లు తమ పంథా మర్చుకోవాల్సిన అవసరం ఉంది.
 

>
మరిన్ని వార్తలు