అద్భుతం.. అద్వితీయం

3 Oct, 2018 07:44 IST|Sakshi
ధ్వజస్తంభాన్ని తాకిన సూర్యకిరణాలు, రాజగోపురం నుంచి వస్తున్న కిరణం

అరసవల్లిలో వరుసగా రెండోరోజూ కనువిందు చేసిన కిరణ స్పర్శ దర్శనం

బంగారు ఛాయలో మెరిసిపోయిన ఆదిత్యుడు

తరలివచ్చిన భక్తజనం   

శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడు వరుసగా రెండో రోజు కూడా తొలి కిరణాల వెలుగులో భక్తులకు కనువిందు చేశాడు. దక్షిణాయన కాల మార్పుల్లో భాగంగా బుధవారం అరసవల్లి సూర్యక్షేత్రంలో సూర్యోదయ తొలి కిరణాలు నేరుగా గర్భాలయంలో ఆదిత్యుని ధ్రువమూర్తిని తాకాయి. సరిగ్గా ఉదయం 6.05 గంటల నుంచి 8 నిమి షాల పాటు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ స్వర్ణ వర్ణ కిరణాలు స్వామి విగ్రహాన్ని అభిషేకించాయి. రాజగోపురం నుంచి ఆలయ మండపాల గుండా ధ్వజస్తంభాన్ని తాకుతూ నేరుగా గర్భాలయంలోని స్వామి వారి పాదాలపై స్పృశించి, తర్వాత ఉదరం, వక్ష భాగం, ముఖభాగంలో కిరణాలు తాకడంతో బంగారు వర్ణంలో స్వామి దర్శనమిచ్చారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు.

అంతరాలయంలో కిటకిట
మంగళవారం కంటే బుధవారం గర్భాలయంలో కిరణాల ప్రసరణ అత్యద్భుతంగా పడటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అంతరాలయం కిటకిటలాడింది. పోలీసులు బందోబస్తు నిర్వహించినప్పటికీ కొద్దిపాటి తోపులాటలు సంభవించాయి. అయితే రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా బుధవారం ఆలయానికి రావడంతో మరింత ఇబ్బందులు నెలకొన్నాయి. వీవీఐపీల కంటే వారి బలగమే అధిక సంఖ్యలో రావడంతో అర్చకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతరాల యం వద్ద ఒక దశలో బారికేడ్లు కూడా ఒరిగిపోయాయి. అయితే ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు ప్రత్యేకంగా సిబ్బందితో చర్యలు చేపట్టడంతో కిరణ దర్శనం తర్వాత సాఫీగా సాగింది. సుమారు 8 నిమిషాల ఈ అద్భుతం తర్వాత ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక పూజలు, నిత్యార్చనలు చేశారు. అనంతరం మహా హారతిని స్వామికి నివేదించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, జిల్లా ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, బొడ్డేపల్లి సత్యవతి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ డోల జగన్, శ్రీకాకుళం, టెక్కలి కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలు చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు తదితరులు దర్శనానికి హాజరయ్యారు. కిరణ దర్శనం అనంతరం వీరికి అంతరాలయంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

చెప్పలేనంత ఆనందంగా ఉంది
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కిరణాల వెలుగులో చూడటం ఇదే తొలిసారి. ఎంతో అద్భుతంగా అనిపించింది. అంతకుముందు పలుమార్లు చూసేందుకు వచ్చినా వాతావరణం అనుకూలించకపోవడంతో కిరణ దర్శణం కలు గలేదు. కానీ ఈసారి బాగా దర్శనం అయ్యింది. మళ్లీ మార్చిలో దర్శనానికి వస్తాను.– నిర్మలాగీతాంబ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి.

మరిన్ని వార్తలు