బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి

15 Apr, 2019 11:26 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు అశీతి పర్వం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి

ఘనంగా మారుతీరావు అశీతి వేడుకలు

ఆకట్టుకున్న సాహితీ ప్రసంగాలు

గొల్లపూడి రచనల ఆవిష్కరణ

కళ్లు నాటికకు నీరాజనాలు

సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జర్నలిజం, నాటకం, నవల, టీవీ, సినిమా, అన్నిటికీ మించి రేడియో ఇన్ని ప్లాట్‌పారాల మీద రాణించడం గొప్ప విషయమని సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. మారుతీరావు 80 జన్మదినం సందర్భంగా విశాఖలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘గొల్లపూడి.. అశీతిపర్వం’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వందేళ్ల కథకు వందనం’పై ఆయన మాట్లాడారు. మారుతీరావు అనేక రంగాల్లో రాణిస్తూ, నిష్ణాతులతో కలిసి పనిచేశారన్నారు. గొప్పవారితో పనిచేసిన అనుభవం, ప్రావీణ్యం ఆయనను చాలా ఉన్నత స్థాయికి చేర్చాయన్నారు. అమెరికా, లండన్‌ వంటి దేశాల నుంచేగాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారూ ఆయన వద్దకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారన్నారు. గొల్లపూడి గొప్ప మేధావి అని, ఆయన ప్రతిమాట సందర్భోచితంగా ఉంటుందని పేర్కొన్నారు. కథా సాహిత్యంలో తనకు చిన్న స్థానం కల్పించినందుకు గొల్లపూడికి రుణపడి ఉంటానని చెప్పారుగొల్లపూడి రచనలు సమాజానికి అవసరంగొల్లపూడి మారుతీరావు రచనలు నేటి సమాజానికి చాలా అవసరమని విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ గండికోట రఘురామారావు అన్నారు.

గొల్లపూడి 80వ జన్మదిన వేడుకలను నిర్వహించడం సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఉదయం జరిగిన సాహితీ గోష్టిని డాక్టర్‌ బి.వి.సూర్యారావు నిర్వహించగా.. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి హాజరై గొల్లపూడి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు గురించి మాట్లాడారు. గొల్లపూడి కంటే ముందు ఆయన రచనలు తనకు పరిచయమయ్యాయని చెప్పారు. జర్నలిజమే తమను ఇన్నేళ్ల పాటు కలిపి ఉంచిందన్నారు. డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ గొల్లపూడి తెరంగేట్రం ముందు, తర్వాత జరిగిన సినిమారంగ విశేషాలను వివరించారు. టీవీలు లేని కాలంలో గొల్లపూడి రేడియో నాటికలు వినడానికి లక్షలాది మంది శ్రోతలు ఆదివారం, గురువారం ఎదురు చూసేవారని గుర్తు చేశారు. యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి పలువురు రచయితలుగా మారడానికి గొల్లపూడి మారుతీరావే స్ఫూర్తి అని తెలిపారు.

డాక్టర్‌ పేరి రవికుమార్‌ మాట్లాడుతూ స్వాతి వీక్లీలో సీరియల్‌గా వచ్చిన ‘రుణం’నవల ఎందుకు ప్రజాదరణ పొందిందో వివరించారు. సినీ రచయిత డాక్టర్‌ వెన్నెలకంటి.. గొల్లపూడి జీవనకాలమ్‌ గురించి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఈ కాలమ్‌ వారం వారం చదువుతున్న తెలుగు పాఠకుల్ని మళ్లీవారం కోసం ఎదురు చూసేలా రాయడం గొల్లపూడికే దక్కిందన్నారు. ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు మాట్లాడుతూ గొల్లపూడిలా బతకడం ఒక కళ, ఒక అదృష్టం, డబ్బుతో కొలవలేని ఐశ్వర్యమని కొనియాడారు. బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ చలం తెలుగు మ్యూజింగ్స్‌ తరువాత గొల్లపూడి ఆంగ్ల మ్యూజింగ్స్‌కు ప్రాచుర్యం ఎందుకొచ్చిందో వివరించారు. మధ్యాహ్నం సభలో చివరిగా మాట్లాడిన డాక్టర్‌ గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గొల్లపూడి ఆత్మకథ అమ్మకడుపు చల్లగా ఎంత గొప్ప రచనకాకపోతే 9వ ప్రచురణకు నోచుకుంటుందని వివరించారు. ఈ సభా కార్యక్రమానికి ముందు శ్రీరామనవమి సందర్భంగా హిడెన్‌ స్ప్రౌట్స్‌ సంస్థకు చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలు దశావతారాలు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

నా బర్త్‌డేని చిరస్మరణీయం చేశారు..
తనకు జరిగిన సన్మానం అనంతరం గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తన 80వ పుట్టిన రోజును విశాఖ రసజ్ఞ వేదిక చిరస్మరణీయం చేసిందన్నారు. కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న తనకు ఏప్రిల్‌ 14 అంటేనే భయంగా ఉండేదని, ఆ రోజు తాను విశాఖ వెళ్తానోలేదో ఆందోళన చెందేవాడినని చెప్పారు. ‘ఒక దశలో ఆ రోజు తలచుకుంటే పానిక్‌ అయ్యే వాడిని. నిద్రపట్టేది కాదు.. ఆరోజు హాజరు కాగలనా? అని అనిపించేది. నిన్న మధ్యాహ్నం వరకు అపోలోలోనే ఉన్నాను. రెండు రోజులపాటు ఆరోగ్యం బాగు పడాలని కాకుండా 14కి విశాఖ వెళ్లేలా చూడండని వైద్యులను కోరేవాడిని. ఇప్పుడు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఆనందంగాను, గర్వంగాను ఉంది’అని వివరించారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్‌ మరణం తనను కలచివేసిందని చెప్పారు. సినిమాల్లో తన భార్యగా ఎక్కువసార్లు నటించిన అన్నపూర్ణ ఎలా ఏడవొచ్చో గ్లిజరిన్‌ రాసుకోవడం ద్వారా చెప్పేదన్నారు. 80 ఏళ్లలో 67 సంవత్సరాలు రాస్తున్నానని, కొన్ని గొప్పగా రాశానని తెలిపారు.

‘సాయంకాలమైంది’
సాయంత్రం ప్రారంభమైన ‘సాయంకాలమైంది’సభను డాక్టర్‌ పేరాల బాలమురళీకృష్ణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కె.సత్యనారాయణ.. గొల్లపూడి..అశీతి పర్వం (జన్మదిన ప్రత్యేక సంచిక)ను ఆవిష్కరించారు. తన రచనలతో కరుడుగట్టిన ఖైదీల మనసులను మార్చగలిగిన మారుతీరావు జన్మదిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ప్రత్యేక సంచిక తొలి ప్రతిని మావూరి వెంకటరమణ స్వీకరించారు. గౌరవ అతిథులు డాక్టర్‌ ఎస్‌.వి.ఆదినారాయణ రేడియో నాటిక మొదటి భాగాన్ని, డాక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌ రేడియో నాటిక రెండో భాగాన్ని ఆవిష్కరించగా.. తొలి ప్రతులను వి.హర్షవర్థన్‌ స్వీకరించారు. డాక్టర్‌ ఆదినారాయణ గొల్లపూడిని ప్రశంసించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య గొల్లపూడి మారుతీరావును అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం గొల్లపూడి రచించిన సాయంకాలమైంది నవలపై డాక్టర్‌ ప్రయాగ సుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. గొల్లపూడి సినిమాలపై రాంభట్ల నృసింహశర్మ తనదైన హాస్య ధోరణిలో మాట్లాడారు. ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు.. గొల్లపూడితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తామిద్దరూ నటించిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర వేసిన గొల్లపూడి నటనను వివరించారు. సభ ముగిసిన అనంతరం గొల్లపూడి రచించిన ‘కళ్లు’నాటికను బాదంగీర్‌ సాయి ఆధ్వర్యంలో మాతృశ్రీ కళానికేతన్‌ వారు వి.సంగమేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించారు. జీవీఆర్‌ఎం గోపాల్‌ వందన సమర్పణలో విచ్చేసిన సాహితీ ప్రియులకు, నాటక ప్రియులకు, గొల్లపూడి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు