మోడల్‌ స్కూళ్లకు మంచి రోజులు

13 Aug, 2019 09:52 IST|Sakshi

ప్రభుత్వంలో విలీనానికి  మెమో జారీ

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు తీపికబురు

పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న సీఎం జగన్‌ 

శ్రీకాకుళం న్యూకాలనీ: మోడల్‌ స్కూళ్లకు (ఆదర్శ పాఠశాలలు) మంచి రోజులు రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆదరణకు నోచుకోని మోడల్‌ స్కూళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. సర్కారులో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పూర్తిస్తాయితో ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని మోడల్‌ స్కూళ్ల సొసైటీకి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2012లో మోడల్‌ స్కూల్‌ విధానం.. 
2012లో మోడల్‌ స్కూల్‌ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరపైకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో జిల్లాకు 14 మోడల్‌ స్కూళ్లను కేటాయించారు. తొలినాళ్లలో నిర్దేషిత నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుండేవి. 2014 ఎన్నికల తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మోడల్‌ స్కూళ్లు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. కనీస నిధులకు నోచుకోకుండా పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. 2012 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.

ప్రయోజనాలకు నోచుకోని ఉపాధ్యాయులు..
2012 డీఎస్సీ విధానం ద్వారా నియామకమై 2013 మే  నుంచి జిల్లాలో 160 మంది ఉపాధ్యాయులు మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఇందులో పీజీటీ, టీజీటీలున్నారు. నియామకమై వారంతా ప్రభుత్వ రెగ్యులర్‌ ఉపాధ్యాయులైనప్పటికీ వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలకు, రాయితీలకు నోచుకోలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా మోసపోయారు. గత ఐదేళ్లు జీతాలు కూడా సరిగ్గా అందలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభిస్తున్న పెన్షన్‌ విధానం, హెల్త్‌కార్డులు, కారుణ్య నియామకాలు, ఏపీజీఎల్‌ఐసీ, పీఎఫ్‌ వంటివి లేకపోవడం శోచనీయం. మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎటువంటి ఆదరణ, ప్రయోజనాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డునపడిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన ప్రయోజనం లేకపోయింది.

పాదయాత్రలో సీఎం జగన్‌ హామీ మేరకు..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర సమయంలో మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు కలిశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతి నెలా జీతాలను మంజూరు చేస్తూ వస్తోంది. అదే విధంగా పాఠశాలలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వ టీచర్ల మాదరిగా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, మోడల్‌ స్కూల్స్‌ సొసైటీ ఈసీ (కార్యనిర్వహణ కమిటీ) సిఫార్సులను పంపాలని ప్రభుత్వం సోమవారం మెమో విడుదల చేసింది.  మోడల్‌ స్కూళ్లపై విధానపరమైన నిర్ణయం ప్రకటించడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏపీఎంఎస్‌ ఉపాధ్యాయుల హర్షం..
ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుంట లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షడు పి.వాసుదేవరావు, కార్యదర్శి బి.సురేష్, గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ కృష్ణారావు, కోశాధికారి పి.రాము, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు లభిస్తున్న అన్ని ప్రయోజనాలు, రాయితీలు కల్పించి తమ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు