చేనేత వెలుగులు

16 Dec, 2019 04:07 IST|Sakshi

వస్త్రాల ఉత్పత్తి పదేళ్లలో 2 శాతం పెరుగుదల

రాష్ట్రంలోనూ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్‌

ఎగ్జిమ్‌ బ్యాంక్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా వస్త్ర పరిశ్రమ నేల చూపులు చూస్తున్న తరుణంలో భారతదేశంలో సంప్రదాయ చేనేత ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. పదేళ్లలో దేశంలో చేనేత ఉత్పత్తులు 2 శాతం పెరిగినట్లు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ (ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రంలో పేర్కొంది. పవర్‌లూమ్, యంత్రాలతో వస్త్రాలు తయారు చేసే ఆధునిక మిల్లులు, సరికొత్త గార్మెంట్‌ పరిశ్రమలు ఎన్ని వచ్చినా చేనేత పరిశ్రమకు ఎలాంటి ముప్పు లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

2017లో దేశంలో 4,594 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాలు ఉత్పత్తి కాగా, అందులో 3,567 కోట్ల చదరపు మీటర్లు (77.4 శాతం) పవర్‌లూమ్‌లపై, 801 కోట్ల చదరపు మీటర్లు (17.4 శాతం) హ్యాండ్‌లూమ్‌లపై (చేనేత), 226 కోట్ల చదరపు మీటర్లు (4.9 శాతం) మిల్లులపైనా జరిగాయి. 2009లో 3,700 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాల ఉత్పత్తి పవర్‌లూమ్‌లపై జరగ్గా, 2017 నాటికి అది 3,567 కోట్ల చదరపు మీటర్లకు తగ్గిపోయింది. అదే సమయంలో 2006లో 654 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాల ఉత్పత్తి చేనేత మగ్గాలపై జరగ్గా, 2017 నాటికి అది 801 కోట్ల చదరపు మీటర్లకు పెరిగింది.

ఏపీలో 5.59 లక్షల మందికి ఉపాధి  
దేశంలోని చేనేత వస్త్రాల్లో 46.8 శాతం అసోంలో ఉత్పత్తి అవుతుండగా, పశ్చిమబెంగాల్‌లో 12.9, మణిపూర్‌లో 8, తమిళనాడులో 6.5, త్రిపురలో 5.8, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా 43.41 లక్షల మంది చేనేత మగ్గాలపై పనిచేస్తున్నారు. ఏపీలో 3,59,212 మంది మగ్గాలపై వస్త్రాలు నేస్తున్నారు. రాష్ట్రంలోని మంగళగిరి, వెంకటగిరి జరీ, చీరాల, మచిలీపట్నం, కడప, ఉప్పాడ, ధర్మవరం, పెద్దాపురం, కుప్పడం, శ్రీకాకుళం, పొందూరు తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలకు మంచి క్రేజ్‌ ఉందని ఎగ్జిమ్‌ బ్యాంక్‌ పేర్కొంది.

చేనేత వస్త్రాల తయారీకి ఎక్కువగా కాటన్‌ ఉపయోగిస్తారు. దేశంలో కాటన్‌ ఉత్పత్తి క్రమేపీ తగ్గుతుండటం చేనేత పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. నేతన్నలకు రుణ సహాయం అందకపోవడం, సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోంది. అయినా దేశంలో చేనేత వస్త్రాలకు ఏమాత్రం ఆదరణ తగ్గకపోవడం గమనార్హం.

హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోలకు మంచి ఆదరణ 
రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహిస్తున్న హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోలకు మంచి ఆదరణ లభిస్తోంది. విశాఖపట్నం, విజయవాడలో ఎక్స్‌పోలు విజయవంతమయ్యాయి. చాలామంది ఎగ్జిబిషన్ల సమయంలో చేనేత వస్త్రాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – డి.పార్థసారథి, హ్యాండీక్రాఫ్ట్స్‌ ప్రమోషన్‌ ఆఫీసర్, శిల్పారామం

మరిన్ని వార్తలు