హాస్టల్‌ విద్యార్థులకు తీపి కబురు

12 Sep, 2019 12:03 IST|Sakshi

కాస్మొటిక్‌ చార్జీలు విడుదల

టీడీపీ హయాంలో విడుదల చేయక పోవడంతో విద్యార్థులకు అవస్థలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల

ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి జిల్లాకు రూ. 10 కోట్ల నిధుల  మంజూరు

నెహ్రూనగర్‌ (గుంటూరు) : సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్‌ చార్జీలు విడుదలయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చార్జీల్ని పెంచుతూ ఆర్భాటాలకు పోయారే తప్పా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  అధికారంలోకి రాగానే విద్యార్థులు పడుతున్న కష్టాల్ని తెలుసుకున్న సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. గత సంవత్సరం నవంబర్‌ నుంచి బడ్జెట్‌ విడుదల అయిందని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలియజేశారు.

మూడు నెలలే ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం
మామూలుగా 3 నుంచి 5 తరగతుల బాలురకు నెలకు రూ.50, బాలికలకు రూ.55 చొప్పున కాస్మొటిక్‌ చార్జీలు ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం 2018లో బాలురకు రూ.100, బాలికలకు రూ.110 చొప్పున  పెంచింది. ఇక 7వ తరగతి బాలురకు 50 నుంచి రూ.125, బాలికలకు రూ.55 నుంచి రూ.160కు పెంచింది. ఎనిమిది ఆపైన తరగతుల బాలురకు రూ.50 నుంచి రూ.125, బాలికలకు రూ.75 నుంచి రూ.160కు పెంచింది. హెయిర్‌ కటింగ్‌ చార్జీ బాలురకు రూ.12 నుంచి రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీల్ని 2018 జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ ముచ్చటగా మూడు నెలలు మాత్రమే ఇచ్చిన టీడీపీ సర్కార్, ఆ తరువాత నుంచి కాస్మోటిక్‌ చార్జీల్ని పెండింగ్‌ పెట్టింది. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల  గత సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు చార్జీలు తీసుకోకుండానే వెళ్లిపోయారు.

జిల్లాకు భారీగా నిధుల మంజూరు
విద్యార్థుల అవస్థలు గుర్తించి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేస్తూ జిల్లాకు రూ. 10కోట్ల 85లక్షల 85 వేలను విడుదల చేసింది. డైట్‌ చార్జీల కింద రూ.7కోట్ల 88లక్షలు, కాస్మోటిక్‌ చార్జీలు కింద రూ. 94 లక్షలు, ట్యూటర్స్‌కు రూ. 32లక్షలు, బిల్డింగ్‌ మెయింటెనెన్స్‌కు రూ. 47లక్షలు, అద్దెలకు రూ. 33లక్షలు మంజూరయ్యాయి.

8,415 మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 78 ఉన్నాయి. వీటిలో హైస్కూల్‌ హాస్టల్స్‌ 72, కాలేజీ హాస్టల్స్‌ 36 ఉన్నాయి. వీటిలో ప్రీ మెట్రిక్‌ విద్యార్థులు 4812, పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థులు 3603 మంది ఉన్నారు. ప్రభుత్వం కాస్మొటిక్‌ చార్జీలు విడుదల చేయడం వల్ల జిల్లావ్యాప్తంగా 8415 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు.

రెండు రోజుల్లో అందరికీ అందిస్తాం  
గత సంవత్సరం నవంబర్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్‌ చార్జీలు, ఇతర బకాయిలు విడుదల అయ్యాయి. ఇప్పటికే విద్యార్థులకు కాస్మొటిక్‌ చార్జీలు చెల్లిస్తున్నాం. రెండు రోజుల్లో అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. –ఎం. రమాదేవి,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి

>
మరిన్ని వార్తలు