ఏ రేషన్ షాపునుంచైనా సరుకులు

27 Jul, 2016 07:43 IST|Sakshi
ఏ రేషన్ షాపునుంచైనా సరుకులు

- రేషన్ డీలర్ల కమీషన్ రూ.20 నుంచి రూ.70కి పెంపు
- మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడలో చేపట్టిన మూడు కృష్ణా పుష్కర పనులకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బిల్లులపై ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో నేరుగా మంత్రివర్గమే వాటిని క్లియర్ చేసింది. వీటికి ఆమోదం తెలిపేందుకే ప్రత్యేకంగా మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి సీఎం స్వయంగా మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

► ప్రకాశం బ్యారేజీ ఎగువన దుర్గాఘాట్ పనుల్ని షార్ట్ టెండర్ పిలిచి రూ.42 కోట్లకు సోమా కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించాం. ప్రకాశం బ్యారేజీ దిగువన విశ్వేశ్వరఘాట్ పనుల్ని సూర్య కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించాం. ప్రకాశం బ్యారేజీ ఎల్‌ఈడీ లైటింగ్ పనులను నిపుణుల కమిటీ విన్ సెమీ కండక్టర్స్ కంపెనీకి రూ.6.45 కోట్లకు ఆ పని అప్పగించింది. ఈ పనులకు ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించే ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో వాటిని చెల్లించేందుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపాం.
► రేషన్ డీలర్ల కమీషన్‌ను రూ.20 నుంచి రూ.70కి పెంచాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.77 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా ఇస్తుంది. వినియోగదారులు ఆధార్ కార్డ్ ఆధారంగా రాష్ట్రంలోని ఏ రేషన్ షాపునుంచైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమలుచేస్తాం. ఎవరైనా ఒక నెల రేషన్ తీసుకోకపోతే తర్వాత నెలలో దాన్ని తీసుకునే అవకాశం కల్పిస్తాం. మూడు నెలల రేషన్‌ను ఒకేసారి తీసుకునే ఏర్పాటుచేస్తాం.
► త్వరలో ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్ నిపుణులను నియమిస్తాం. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారితోపాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేవారు, ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు, ఐక్యరాజ్యసమితి నుంచి వచ్చే నిపుణులు పార్ట్‌టైమ్‌గా ఉచిత సేవలందించవచ్చు.

మరిన్ని వార్తలు