పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయం

6 Apr, 2020 04:01 IST|Sakshi

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 

ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలను గ్రామీణ ప్రజల దాకా చేర్చడంలో  పంచాయతీ కార్యదర్శుల కృషి అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో ప్రశంసించారు. వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..  

► తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, బోరు బావులు, డ్రైనేజీ వ్యవస్థలను పర్యవేక్షించడం వంటి కీలక విధులతో పాటు ప్రజారోగ్యానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు అందించి పంచాయతీ కార్యదర్శులు, ఇతర సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు సరికొత్త రికార్డు సృష్టించారు.  
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయడంలో పంచాయతీ, సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోంది.  
► కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ ఉన్నత స్థాయి వరకు అందజేయడంలో పంచాయతీ వ్యవస్థ మహత్తర కృషి చేస్తోంది.  
► దేశంలోనే ఆదర్శవంతమైనవిగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు గుర్తింపు సాధించడం గర్వకారణ ం. 
► అనేక రాష్ట్రాలకు మన ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న ఈ వ్యవస్థలు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలవడం ఉద్యోగులు, వలంటీర్ల చిత్తశుద్ధికి నిదర్శనం.  
► ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం, పరిశుభ్రతతో, ముందు జాగ్రత్తలతో కరోనా వంటి మహమ్మారి కట్టడికి చిత్తశుద్ధితో సేవలందించడంలో ఉద్యోగులు సైనికుల్లా పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు