‘ఎన్నికల ఫలితాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం’

29 Apr, 2019 18:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: వీవీప్యాట్ల లెక్కింపుతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో అధికారులు వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్‌ చేస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కిస్తారు.

ఈ పద్దతిన రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్‌లలో పోలైన స్లిపుల్ని లెక్కించాలి. ఒక్కో వీవీప్యాట్‌లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఒక వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపునకు సగటున గంట, గంటన్నర సమయం పడుతుంది. ఈ స్లిప్పులు లెక్కించే అధికారం ఆర్వో, అబ్జర్వర్‌లకు మాత్రమే ఉంది. దీంతో ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలు వెల్లడిస్తాం. మొదట అసెంబ్లీ, తర్వాత లోక్‌సభ ఫలితాలు వెలువడుతాయ’ని తెలిపారు.

>
మరిన్ని వార్తలు