రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది

18 Jan, 2019 03:26 IST|Sakshi

ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా బదిలీఓటర్ల జాబితాల్లో అవకతవకలు,బోగస్‌ ఓటర్లను తొలగించడంలో అలసత్వమే కారణం.. బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ ద్వివేది 

అందరి సహకారంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడి

ఎన్నికల ఏర్పాట్లపై నేడు అఖిలపక్ష సమావేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియాను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేయాలని నిర్ణయించడానికి ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, బోగస్‌ ఓటర్లను తొలగించడంలో అలసత్వం తదితరాలే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు లక్షల సంఖ్యలో బోగస్‌ ఓటర్లను చేర్పించడం, ప్రతిపక్షానికి మద్దతుదారులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసోడియాను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నియమించడానికి ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా పంపాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపింది. వచ్చే ఎన్నికలను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఎన్నికల ఏర్పాట్లును ప్రారంభించిన ఈసీ 
రాష్ట్ర శాసన సభతోపాటు లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా సొంత జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడి నుంచి బదిలీ చేయాలని, అలాగే నాలుగేళ్లలో మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బదిలీల మార్గదర్శకాలను గురువారం పంపించింది. ఈ బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని, సంబంధిత నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని పేర్కొంది.

సొంత జిల్లాలో లేదా సొంత నియోజవర్గాల్లో పనిచేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌) రిటర్నింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్, ఐజీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ నాలుగేళ్లలో మూడేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తుంటే, వారిని కూడా అక్కడ నుంచి బదిలీ చేయాలని వెల్లడించింది. గతంలో ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఈసారి ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. క్రిమినల్‌ కేసులు నమోదైన అధికారులను ఎన్నికల విధులకు వినియోగించరాదని తెలిపింది.

ఓటర్ల జాబితా సవరణల్లో పాల్గొంటున్న అధికారులను కూడా జాబితాను ప్రకటించిన వెంటనే బదిలీ చేయాలని పేర్కొంది. ఆరు నెలల్లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ సర్వీసులోకి తీసుకుంటే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పింది. మార్గదర్శకాల మేరకు బదిలీలు చేసినట్లుగా ఎన్నికల అధికారులందరూ జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ప్రధాన అధికారికి డిక్లరేషన్‌ సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.  

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తా.. 
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం సాయంత్రమే ద్వివేదీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కేడర్‌కు చెందిన ద్వివేదీ కేంద్ర ప్రభుత్వంలో గత ఏడాది వరకూ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే సాధారణ పరిపాలన(సర్వీసెస్‌) శాఖ ముఖ్య కార్యదర్శిగానూ(ఇన్‌చార్జి) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ద్వివేదీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ అందరి సహకారంతో నిష్పక్షపాతంగా, సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.

ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతోపాటు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఉంటే సరిచేస్తామన్నారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఓటు విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్‌ ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై, తీసుకోవాల్సిన చర్యలపై గోపాలకృష్ణ ద్వివేదీ అఖిలపక్ష నాయకులతో చర్చించనున్నారు.  

మరిన్ని వార్తలు