ఓట్ల తొలగింపునకు భారీగా అక్రమ దరఖాస్తులు

4 Mar, 2019 02:30 IST|Sakshi

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతో ఫారం–7 సమర్పణ

అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు

ఇప్పటివరకు 45 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

తూర్పుగోదావరి జిల్లాలో మీ–సేవ సిబ్బంది హస్తం

తనిఖీలు చేయకుండా ఓట్లు తొలగించం

ఓట్ల తొలగింపుపై ఆందోళన వద్దు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమేనని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరులు ఫారం–7 సమర్పించారని, ఆన్‌లైన్‌ ద్వారా ఇటువంటి తప్పుడు, అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌ ద్వారా ఓట్లు తొలగించాలంటూ అసలైన ఓట్లర్లతో సంబంధం లేకుండా ఇతరులు అక్రమంగా ఫారం–7 సమర్పించిన వారిని గుర్తించే చర్యలు సాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మోసపూరిత చర్యలకు పాల్పడే వ్యక్తులు వేల సంఖ్యలో ఓట్లు తొలగింపునకు ఆన్‌లైన్‌లో ఫారం–7 సమర్పించినట్లు వారం రోజుల క్రితం గుర్తించామని ద్వివేదీ వివరించారు. అసలైన ఓటర్లకు తెలియకుండానే వారి పేర్లతో ఇతరులు ఫాం–7 సమర్పించారన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారిపై విచారణ జరపవడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించామని వివరించారు. ఈ విషయంలో ఓటర్లు కూడా సహకరించాల్సిందిగా కోరారు. 

తొమ్మిది జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌లు
కాగా, ఇప్పటివరకు 45 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ద్వివేదీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 120బి, 419, 420, 465, 471లతోపాటు ఐటీ చట్టం సెక్షన్లు 66, 66డి,లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌–31 కింద తొమ్మిది జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, కర్నూలు జిల్లాలో 8, విశాఖలో 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫాం–7 సమర్పించిన వారిలో తూర్పుగోదావరి జిల్లాల్లో మీ సే–వకు చెందిన ఆరుగురు సిబ్బంది హస్తం ఉందని.. జిల్లా కలెక్టర్‌ వారిపై చర్యలను తీసుకుంటున్నారని ద్వివేదీ పేర్కొన్నారు. 

ఐపీ చిరునామా కోసం సీ–డాక్‌కు లేఖ
ఈ అక్రమ వ్యవహారాల్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో మరింత లోతుగా పోలీసు దర్యాప్తు చేసేందుకు ఐపీ చిరునామా ఇవ్వాల్సిందిగా సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ–డాక్‌)కు లేఖ రాసినట్లు ద్వివేదీ తెలిపారు. బోగస్‌ దరఖాస్తుల ఆధారంగా ఎవ్వరి ఓట్లనూ తొలగించబోమని, సవివరమైన తనిఖీలు, విచారణ జరుపుతామని.. ఈ విషయంలో ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సీఈవో ఆమోదంతోనే ఓట్ల తొలగింపు జరుగుతుందన్నారు.  

మరిన్ని వార్తలు