మీ ఓటెంతో రహస్యం

9 Apr, 2019 05:21 IST|Sakshi

అదెవరికి వేశారన్నది ఎవరికీ తెలియదు

ఓటు వేసిన వారికి మాత్రమే వీవీప్యాట్‌లో కనిపిస్తుంది

మీరెవరికి ఓటేశారో తమకు తెలుస్తుందన్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి

దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చే వారికి కూడా సిరా మార్కు వేయాలి

సెల్‌ఫోన్లు, కెమెరాలు తీసుకురావడానికి వీలులేదు

సాక్షితో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది

సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల నుంచి ప్రవేశపెట్టిన వీవీప్యాట్‌లతో ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. పోలింగ్‌ బూత్‌లో వేసిన ఓటు మరో వ్యక్తికి తెలిసే అవకాశమే ఉండదని, అటువంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఓటు వేసిన వారికి మాత్రమే వీవీప్యాట్‌లో ఎవరికి ఓటు వేశారన్నది ఏడు సెకన్లపాటు కనిపిస్తుందని, ఆ తర్వాత దీన్ని ఇక ఎవ్వరూ చూసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 11 ఎన్నికల ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ద్వివేది ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఎవరికి వోటు వేశారో మాకు తెలుస్తుందంటూ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తుంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలయ్యేంత వరకు నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదన్నారు. ప్రచారం తర్వాత ప్రలోభాలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యయ పరిశీలకులు ఈ అంశంపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.110 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన మద్యం, 100 కేజీల బంగారం, 325 కేజీల వెండిని పట్టుకున్నట్లు తెలిపారు.

ఒక సహాయకుడు ఒక్కరికే..
దివ్యాంగ ఓటరుకు సహాయకులుగా వచ్చినవారి విషయంలో ఎన్నికల నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, పోలింగ్‌ సిబ్బంది వీటిని తూ.చ తప్పకుండా పాటించాలన్నారు. ఒక సహాయకుడు ఒకరికి మాత్రమే సహాయంగా పోలింగ్‌ కేంద్రంలోకి రావడానికి అనుమతిస్తారని, ఇలా వచ్చిన సహాయకుడి కుడి చేతి వేలుకు ఇంకు మార్కు వేయాల్సి ఉంటుందని, దీనివల్ల అతను మరొకరికి సహాయకుడిగా రావడానికి వీలుండదన్నారు. దివ్యాంగులకు ఓట్‌ వేసేందుకు వీల్‌ చైర్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్‌ కేంద్రాల్లోకి  కెమెరాలు, సెల్‌ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును వేరేవాళ్లు వేసి ఉంటే టెండర్‌ ఓటు ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, దీనికి సంబంధించిన పత్రాలు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ వద్ద ఉంటాయన్నారు. కానీ ఈ ఓటును ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరని ఆయన స్పష్టం చేశారు.

బలగాలు రాకపోయినా...
ఎన్నికల నిర్వహణకు అడిగిన పోలీసు సిబ్బంది కంటే 15,000 మంది తక్కువగా వచ్చారన్నారు. అదనపు బలగాలు రాకపోయినా ఉన్న సిబ్బందితోనే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సాయుధ బలగాలు వినియోగించి, సున్నిత ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్‌తో, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు తమకు అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో 50 ఓట్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి వాటిని డిలీట్‌ చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సమయంలో ఓటింగ్‌ యంత్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దడానికి నియోజకవర్గానికి ముగ్గురు భెల్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం అదనపు ఓటింగ్‌ యంత్రాలు, 25 వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలింగ్‌ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులు సిద్ధం చేశామని, 10వ తేదీ మధ్యాహ్నం నుంచే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు