నా మాటలను మీడియా వక్రీకరించింది

21 Dec, 2019 05:40 IST|Sakshi

వికేంద్రీకరణపై సీఎం జగన్‌ చెప్పినదాంతో ఏకీభవిస్తున్నా

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  

సాక్షి, అమరావతి: రాజధాని అంశంపై తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు, మీడియా పూర్తిగా వక్రీకరించాయని, తల, తోక తీసేసి ప్రసారం చేశాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినదాంతో తామందరం ఏకీభవిస్తున్నామన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనతో హైదరాబాద్‌ మహా నగరాన్ని కోల్పోయి, ఎంత నష్టపోయామో అందరికీ తెలిసిందేనన్నారు. పెట్టుబడులు అక్కడే పెట్టడంతో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనకబడ్డాయన్నారు. దాన్నుంచి గుణపాఠం నేర్చుకోకుండా చంద్రబాబు మళ్లీ అదే తప్పిదం చేశారని విమర్శించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను తుంగలో తొక్కారన్నారు. అయితే శివరామకృష్ణన్‌ కమిటీ నిర్ణయాన్నే ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పుడు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆ మేరకు వికేంద్రీకరణలో భాగంగా లెజిస్లేటివ్‌ కేపిటల్‌ అమరావతిలో, కార్యనిర్వాహక కేపిటల్‌ విశాఖలో, జ్యుడీషియల్‌ కేపిటల్‌ కర్నూలులో ఉండేలా ఆలోచనలు చేస్తున్నామని సీఎం చెప్పినదాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం కూడా సీఎంను సమర్థించాలన్నారు. తాను పదేళ్లుగా వైఎస్సార్‌సీపీలో ఉన్నానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

మరిన్ని వార్తలు