పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్‌

20 Dec, 2019 10:35 IST|Sakshi

సాక్షి, అనంతపురం: పోలీసులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజల ధన మాన ప్రాణాలను.. దేశ సమగ్రతను, సారభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని ఎంపీ మాధవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ట్రయిల్‌ వేస్తేనే ఎంపీ అయ్యా
రాత్రనక​, పగలనక ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. తాను పోలీసు అధికారిగా ఉండగా పోలీసులపై దివాకర్‌రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే... ప్రజలు తనను పార్లమెంట్‌కు, జేసీని బజారు పంపించారని చురకలంటించారు. ‘నేను జస్ట్‌ ట్రయిల్‌ వేస్తేనే ఎంపీ అయ్యాను. ఎమ్మె​ల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ ఎంతో మంది పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్ధతతో అక్కడ కొనసాగుతున్నారు. నేను జస్ట్‌ ట్రయిల్‌ చూపించాను. ట్రయిల్‌ చూపిస్తేనే నేను ఎంపీ అయ్యాను. ఈ విషయాన్ని జేసీ గుర్తించుకోవాల’ని మాధవ్‌ అన్నారు.

జగన్‌ నన్ను మందలించారు
పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్‌ తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. జేసీ మాటలు విని చంద్రబాబు నవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కర్ణకఠోమైన వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని నిలదీశారు. ఇటీవల కియో కంపెనీకి వెళ్లినప్పడు తనతో పాటు వచ్చిన అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మరిచిపోవడంతో తనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మందలించారని వెల్లడించారు.

కాగా, జేసీ వ్యాఖ్యలను రాష్ట్ర, జిల్లాల పోలీసులు సంఘాలు తప్పుబట్టాయి. జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా పోలీస్‌ సంఘం (అడ్‌హక్‌ కమిటీ) డిమాండ్‌ చేసింది. (బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా: జేసీ)

మరిన్ని వార్తలు