కత్తుల చంద్రయ్య

26 Mar, 2019 08:47 IST|Sakshi

ఎన్నికల సిత్రం 

పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు నవ్వితే నవ్వుదాం అని చూస్తున్నారు కార్యకర్తలు. కానీ ఆయన నవ్వడం లేదు.
 
‘‘మిమ్మల్ని మీరు మోసం చేసుకుని, పార్టీని, నన్ను మోసం చేయకండి’’ అన్నాడు చంద్రబాబు కోపాన్ని ఆపుకుంటూ!  

‘నువ్వు చేశావా, నువ్వు చేశావా.. బాబు గారిని నువ్వు చేశావా మోసం..’ అని కార్యకర్తలు ముఖాలు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్ని చూసిన చంద్రబాబు.. ‘‘అమాయకత్వం నటించకండి. నాకు అన్నీ తెలుసు. ఎవరికి ఎవర్నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయో, ఎవరు వెళ్లి ఎవర్ని కలుస్తున్నారో, ఎవరు దేనికి ఆశపడుతున్నారో.. అన్నీ తెలుసు. ఆ పనులన్నీ మానండి. ఎవరి మాటలూ వినకండి. మనమే గెలుస్తాం. మన తరఫున ప్రచారానికి ఉత్తరాది నుంచి స్టార్‌ లీడర్లని రప్పిస్తున్నాం. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్‌ అబ్దుల్లా కూడా రాబోతున్నారు. పవన్‌ ఆల్రెడీ మనకు ప్రచారం చేస్తున్నాడు. కేఏ పాల్‌నీ ప్రచారానికి ఒప్పిస్తున్నాం’’ అన్నాడు. 

 ‘వపన్‌ ఉన్నాడు కదా, మళ్లీ పాల్‌ ఎందుకు, ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా?’’ అన్నాడో కార్యకర్త. 

‘‘రెండు కాదు, మూడు కత్తులు..’’ అన్నారెవరో.
 
‘‘ఎవరు ఆ మూడో కత్తి?!’’  

ఈ ప్రశ్న వేసిన కార్యకర్త నెత్తిపైన టప్‌ మని మొట్టిక్కాయ కొట్టాడు పక్కనున్న కార్యకర్త. ‘‘లోకేశ్‌బాబు కత్తి కాదనుకున్నావురా. బాలయ్యబాబు కంటిచూపుతో చంపేస్తే, లోకేశ్‌బాబు సింగిల్‌ వర్డ్‌తో చంపేస్తాడు’’ అన్నాడు.  

చంద్రబాబు కల్పించుకున్నాడు. ‘‘అదే నేను చెప్పేది. మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఉంటే అక్కడ జగన్‌కు ఓట్లు పడతాయి. మన ఒర చిన్నదేం కాదు. ఎన్ని కత్తులైనా పడతాయి. పవను, పాల్, లోకేశే కాదు.. ఇంకో ముప్‌పై కత్తుల్ని రెడీ చేశా. జగన్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కత్తులు ఏసేస్తాయి. నా కత్తి, లోకేశ్‌ కత్తి ఒకవేళ ఒరలో ఇరుక్కుపోయినా వంగవీటి రాధా కత్తి, యమనల కత్తి, మురళీమోహన్‌ కత్తి, బాలకృష్ణ కత్తి, జూపూడి కత్తి.. జగన్‌ జనంలోకి వెళ్తున్నప్పుడు ఏసేస్తాయి! అక్కడ తప్పించుకున్నాడనుకో.. రాజేంద్రప్రసాద్‌ కత్తి, బుద్ధా వెంకన్న కత్తి, కాకి గోవిందరెడ్డి కత్తి, వర్ల రామయ్య కత్తి, దివ్యవాణి కత్తి.. జగన్‌ సరిగ్గా జనం మధ్యలో ఉన్నప్పుడు ఏసేస్తాయి! అక్కడా తప్పించుకున్నాడనుకో.. మిగతా ఇరవై కత్తులు జగన్‌ జనం కన్నీళ్లు తుడుస్తున్నప్పుడో, జనం తల నిమురుతున్నప్పుడో వెనగ్గా వెళ్లి ఏసేస్తాయి..’’ అని చెప్పాడు చంద్రబాబు. అప్పుడు కనిపించింది కార్యకర్తలకు చంద్రబాబు కళ్లల్లో నవ్వు! 

‘‘మరి ఆ ముప్‌పై మందిలో మా ఫేవరేట్‌ కత్తి లేదా?’’ అని పెద్దగా అరిచారు యువ కార్యకర్తలు కొందరు.  ‘‘నాకు అర్థమైంది తమ్ముళ్లూ.. యామిని కత్తి గురించే కదా మీరు అడుగుతున్నదీ. రెండో లిస్టు కత్తుల్లో ఆమె పేరూ ఉంటుంది. అన్నీ నేను చూసుకుంటా’’ అని హామీ ఇచ్చాడు. యువ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

‘‘తమ్ముళ్లూ.. మీ పక్కన పెద్దవాళ్లు కూడా కూర్చొని ఉన్నారు. కాస్త చూసుకుని ఉత్సాహం ప్రదర్శించండి’’ అన్నాడు చంద్రబాబు.  యువ కార్యకర్తలు పక్కకు చూసి, నాలుక కరుచుకున్నారు. ‘ఈ’పేపర్‌ ఓనరు, ‘ఆ’పేపర్‌ ఓనరు కూర్చొని ఉన్నారు!  

‘‘వీళ్లెందుకు వచ్చార్రా’’ అని గొణుక్కున్నాడు ఓ యువ కార్యకర్త. 

‘‘పార్టీ కార్యకర్తల టెలికాన్ఫరెన్స్‌కి వీళ్లు రాకపోతే ఎవరొస్త్రారా.. 

నోర్మూసుకుని కూర్చో’’.. అని యువ కార్యకర్త డొక్కలో పొడిచాడు పక్కనున్న కార్యకర్త.  

– మాధవ్‌

మరిన్ని వార్తలు