దొంగనోట్ల కలకలం

12 Aug, 2019 09:49 IST|Sakshi
కోయిదాలో పింఛన్ల రూపంలో అందించిన నకిలీ రూ.500 నోటు

సాక్షి, పశ్చిమగోదావరి : వేలేరుపాడు మండలంలోని కోయిదా గ్రామంలో దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయక గిరిజనులే కదా ఏమౌతుందిలే అనుకున్నారో లేదా వరద ప్రభావం ఉండడంతో ఎవరూ పట్టించుకోరు కనుక సందెట్లో సడేమియా అంటూ పనికానిచేద్దామనుకున్నారో తెలియదు కానీ పింఛన్‌ నిమిత్తం అందించే నగదులో రూ.500 నకిలీనోట్లు చేర్చి గిరిజనులకు అందించారు. దీంతో అవి తీసుకున్న గిరిజనులు షాపుల వద్దకు సరుకులు కొనుక్కునేందుకు వెళ్లడంతో వ్యాపారులు గుర్తించి గిరిజనులకు చెప్పారు. దీంతో విషయం బయటకు పొక్కింది. దాదాపుగా రూ.12 వేలు నకిలీ నగదు గిరిజనులకు అంటగట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయమై గిరిజనులు స్థానిక ఎంపీడీఓకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఎంపీడీఓ సదరు  సెక్రటరీని పిలిపించి వివరణ కోరగా అతను బ్యాంక్‌ ద్వారా వచ్చిన నోట్లనే అందించినట్టు తెలిపడమే కాక రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇవి బ్యాంక్‌ ద్వారా వచ్చాయా లేదా మధ్యలో మరేదైనా జరిగిందా అన్న విషయం లోతుగా దర్యాప్తు చేస్తే కానీ అసలు దొంగలు ఎవరన్నది బయటపడదని పలువురు వాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు