పొలాల్లోకి వెళ్లి బాధలు వింటూ..

16 Nov, 2014 01:41 IST|Sakshi

గొట్టిపాటి రవి : నమస్తే.. నాపేరు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యేని. సాగర్ జోన్-2 పరిధిలో మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. నీకు ఎంత పొలం ఉంది? నీ ఇబ్బందులు ఏంటి?
 దిండు రాఘవయ్య : నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నీరు విడుదల రెండు నెలలు ఆలస్యం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. నాచు పెరిగిపోయిందని దమ్ము చేయడానికి కాల్వలు ఆపడం వల్ల కలుపు పెరిగిపోయి ఖర్చు ఎక్కువయింది.

  గొట్టిపాటి రవి : వ్యవసాయం ఎలా ఉంది? నీరు సరిగ్గా అందుతోందా? (కలుపు తీస్తున్న పొలంలోకి నడుచుకుంటూ వెళ్లి రైతును పలకరించారు.
 కోటేశ్వరరావు : నాకు రెండెకరాల పొలం ఉంది. నీరు అందడం ఆలస్యమయింది. మధ్యలో కాల్వలు కట్టివేయడంతో పొలంలో కలుపు పెరిగిపోయింది. దీన్ని తీయడం కోసం రోజుకు 10 నుంచి 20 మంది కూలీలను పెట్టుకోవాల్సి రావడంతో ఆరేడు వేల రూపాయలు అదనంగా ఖర్చయింది.

 గొట్టిపాటి రవి : ఎరువులు దొరుకుతున్నాయా?
 కోటేశ్వరరావు : యూరియా ధరలు బాగా పెంచేశారు. బస్తా రూ.325 నుంచి రూ. 400 వరకూ అమ్ముతున్నారు. అది కూడా స్టాక్ లేదంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.
 (అక్కడి నుంచి ముందుకు వస్తూ పత్తి పొలం వద్ద ఆగారు. పత్తి పొలంలో ఉన్న రైతులను పలకరించారు. )
 
గొట్టిపాటి రవి : పత్తి దిగుబడి ఎలా వస్తోంది? ఎన్ని ఎకరాలు వేశారు?
 అడ్డగడ్డ సాంబయ్య : మొత్తం నాలుగు ఎకరాల్లో పత్తి వేశాము. ఇప్పటి వరకూ మొక్కలు ఏపుగా ఎదిగాయి. పత్తి వస్తున్న సమయంలో వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కో ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
 
గొట్టిపాటి రవి : ఇప్పటి వరకూ ఎంత ఖర్చయింది.
 సాంబయ్య : ఎకరానికి 15 వేల రూపాయలకు పైగా ఖర్చయింది. అయితే గిట్టుబాటు ధరలు లేవు.
 
గొట్టిపాటి రవి : ఇప్పుడు ఎంత ధర పలుకుతోంది?
 సాంబయ్య : ఇప్పుడు క్వింటాలుకు మూడు వేల రూపాయలుంది. ప్రస్తుతం ఖర్చులు పెరిగిపోవడంతో ఐదు వేల రూపాయల వరకూ కావాల్సి ఉంటుంది.  
 
గొట్టిపాటి రవి : బ్యాంకు రుణం వచ్చిందా?
 సాంబయ్య : బ్యాంకులు రుణమాఫీని అడ్డం పెట్టుకుని రుణాలు ఇవ్వలేదు. దీంతో ఐదు రూపాయల వడ్డీకి బయట నుంచి రుణాలు తేవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర రాకపోతే పొలం అమ్ముకుని అప్పులు తీర్చాల్సి వస్తుంది.
 
గొట్టిపాటి రవి : వర్షం వల్ల ఇబ్బంది ఉందా?
 కామాను కోటేశ్వరరావు : వర్షం కారణంగా పత్తి తడిసిపోయింది. దీంతో కొంత పత్తి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. పైగా లద్దె పురుగు వచ్చింది. బీటీ విత్తనాలకు లద్దె పురుగు రాదని చెప్పారు. కాని ఇప్పుడు లద్దె పురుగు వచ్చిందంటే ఇవి నకిలీ విత్తనాలు.
 
గొట్టిపాటి రవి : వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారా
 కోటేశ్వరరావు : ఎప్పుడు ఫోన్ చేసినా జన్మభూమిలో ఉన్నామని చెబుతున్నారు.
 
గొట్టిపాటి రవి : ఇప్పుడు జన్మభూమి ముగిసింది. సంప్రదించండి. నేను కూడా సైంటిస్టులతో మాట్లాడతాను. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు జిల్లాలో నకిలీ విత్తనాలు లేవని చెప్పారు. ఇక్కడి పరిస్థితిని వారి దృష్టికి తీసుకువస్తాను. (అక్కడి నుంచి బయలుదేరి  కొమ్మాలపాడు వెళ్లారు. అక్కడ పొలాల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో బురదలోనే మోటార్‌బైక్‌పై ముందుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.)
 
గొట్టిపాటి రవి : ఏంటి నీరు సక్రమంగా వస్తోందా?
 వెంకటరావు (సొసైటీ అధ్యక్షుడు) : శివారు భూములకు నీరు అందడం లేదు. నీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదు.  దీంతో ఇబ్బందిగా ఉంది. మద్యలో నీరు ఆపడం వల్ల తడిచిన పొలాలే మళ్లీ తడుపుకోవాల్సి వచ్చింది. కింది రైతులకు నీరు అందడం లేదు.
 
గొట్టిపాటి రవి : పంటలు ఎలా ఉన్నాయి
 రజియా : వర్షం వల్ల నష్టపోయాము. ఈసారి ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఖర్చు పెరిగిపోయింది. గిట్టుబాటు ధర లేకపోతే కష్టమే. (అక్కడి నుంచి బయలుదేరి మిర్చి పంటలోకి వెళ్లారు. అక్కడ రైతులను, కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.)
 
గొట్టిపాటి రవి : వర్షం వల్ల నష్టం వచ్చిందా?
 మిర్చి రైతులు :  వర్షం వల్ల నష్టం లేదు. కొంత ఉపయోగపడుతుంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో పెట్టుబడి తిరిగి వస్తుందా అన్నది అనుమానమే.
 
గొట్టిపాటి రవి : ఇంకేమైనా సమస్యలున్నాయా?
 హుస్సేన్ : ఈ ప్రాంతంలో పొలాలన్నీ అగ్రహారం కింద ఉన్నాయి. తరతరాలుగా మేమే సాగు చేసుకుంటున్నాం. అయితే పొలాలు మా పేరుతో లేవు కాబట్టి  రుణమాఫీ రాదని చెబుతున్నారు.
 గొట్టిపాటి రవి : నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తా.

>
మరిన్ని వార్తలు