అమరావతిలో ‘కరోనా’ అనుమానితులు!

29 Mar, 2020 05:19 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన వారంతా వైద్య పరీక్షలకు సహకరించాలి : డీజీపీ సవాంగ్‌ 

సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం చెప్పకుండా అమరావతి, గుంటూరులో రహస్యంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. వారంతా కరోనా అనుమానిత జాబితాలో ఉన్నందున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలకు సహకరించాలన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో లాక్‌డౌన్‌ అమలు తీరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

- డయల్‌ 100లో వచ్చిన 320 కాల్స్‌ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం వచ్చింది. అలాంటి వారు వారంతా స్వయంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. 
- అనుమానితులకు వైద్య పరీక్షలు చేసి కరోనా పాజిటివ్‌ వస్తే హాస్పిటల్‌కు, లేకుంటే హౌస్‌ క్వారంటైన్‌కు తరలిస్తామే తప్ప ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు.  
- విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ‘హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌’లో నమోదు చేస్తున్నాం. 
- కరోనా వైరస్‌ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించినందున లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నాం. నిత్యావసర సరుకుల వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
- ఇప్పటి వరకు వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు ఉంటాయి.  

మరిన్ని వార్తలు